|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకున్న మహిళ అనుమానాస్పద మృతి ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

ఈరోజు ఎన్టీఆర్ కాలనీ సమీపంలోని విష్ణుప్రియ హాస్పిటల్ వెనుక భాగంలో రాత్రి సుమారు 8 గంటల సమయంలో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం సితాయిపేట్ తాండాకు చెందిన జారుపుల కాంతి (55) అనే మహిళ మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఇదిలా ఉండగా ధర్పల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టీవీఎస్ ఎక్స్‌ఎల్ ద్విచక్ర వాహనంపై గోనె సంచిలో మహిళ మృతదేహాన్ని ఇతర ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే మార్గమధ్యంలో వాహనం నుంచి సంచి జారిపడటంతో అక్కడి ప్రజలు అనుమానంతో దగ్గరకు వెళ్లి పరిశీలించగా అందులో మహిళ మృతదేహం ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటనే గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ధర్పల్లి సీఐ బిక్షపతి తెలిపారు. మహిళ మృతి వెనుక ఉన్న అసలు కారణాలు పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టమయ్యే అవకాశం ఉందని పోలీసులు వెల్లడించారు.








