ప్రభుత్వ భూమి కబ్జా కలకలం.. అక్రమ వెంచర్లో విలీనం చేసిన వైనం.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, జానకంపేట్ గ్రామం అక్రమాలకు కేంద్రంగా మారిందనే ఆరోపణలు రోజురోజుకూ బలపడుతున్నాయి. ఇదివరకే నాన్-లేఅవుట్ వెంచర్లు, అనుమతులు లేని వ్యాపార సముదాయాలు, నిబంధనలు అతిక్రమించిన భూ విక్రయాలు వంటి అంశాలతో వార్తల్లో నిలిచిన ఈ గ్రామంలో ఇప్పుడు ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం వెలుగులోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. గ్రామంలో అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా అక్రమార్కులు రెచ్చిపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ప్రభుత్వ భూమి కబ్జా.. భూదందా దారుల ఆక్రమణ..

గ్రామంలోని సర్వే నెంబర్ 788లో దాదాపు ఎకరం ప్రభుత్వ స్థలం ఆక్రమణదారుల ఆధీనంలోకి వెళ్లినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. మస్జిద్ ఏ అబ్దుల్ వాహెద్ మస్జిద్ వెనుక భాగంలో ఉన్న 786, 790/1, 787/1 సర్వే నంబర్ల పరిసర ప్రాంతాల్లో ఎలాంటి లేఅవుట్ అనుమతులు లేకుండానే వెంచర్ రూపకల్పన జరిగింది. ఇదే క్రమంలో పక్కనే ఉన్న సర్వే నెంబర్ 788లోని ప్రభుత్వ భూమిని అక్రమంగా వినియోగిస్తూ, వెంచర్‌కు అనుకూలంగా రోడ్డు నిర్మాణ పనులు చేపట్టడం, మిగిలిన భూమిని ప్లాట్లుగా విభజించి విక్రయాలకు సిద్ధం చేయడం వంటి చర్యలు బహిరంగంగానే జరిగాయని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఎన్నో సంవత్సరాల క్రితమే ఈ ప్రభుత్వ భూమి కబ్జాకు గురై ఉన్న సంబంధిత అధికారులు మౌనం వహించడం వెనుక గల కారణాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత వారం ఇదే గ్రామంలో అక్రమ నాన్-లేఅవుట్ వెంచర్ వ్యవహారం, అలాగే కొన్ని రోజుల క్రితం అనుమతులు లేని వ్యాపార సముదాయాలపై కథనాలు వెలువడినా ఇప్పటివరకు అధికారుల నుంచి ఎలాంటి గట్టి చర్యలు లేకపోవడం ప్రజల్లో అసహనం పెంచుతోంది.

అక్రమాలపై వార్తలు ఎన్నో కానీ చర్యలు శూన్యం..

ఒకవైపు అనుమతులు లేని కమర్షియల్ నిర్మాణాలు, మరోవైపు నిబంధనలకు విరుద్ధమైన వెంచర్లు, ఇప్పుడు ప్రభుత్వ భూములపై బహిరంగ కబ్జాలు—ఇలా జానకంపేట్ గ్రామం అక్రమార్కులకు అడ్డాగా మరిందనే అభిప్రాయం బలపడుతోంది. ఈ గ్రామం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలో ఉండడం, బోధన్–బాసర–నిజామాబాద్ ప్రధాన మార్గాలకు అనుసంధానంగా ఉండే రహదారి సౌకర్యం ఈ గ్రామాన్ని రియల్ ఎస్టేట్ దందాలకు కేంద్రంగా మార్చిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామస్తుల వాదన ప్రకారం, స్థానిక అధికారుల స్థాయిలో సమస్యలు పరిష్కారం కావడం కష్టమైందని, జిల్లా ఉన్నతాధికారులు నేరుగా జోక్యం చేసుకుని సర్వే నెంబర్ 788లోని ప్రభుత్వ భూమిని తక్షణం రక్షించాల్సిన అవసరం ఉందని కోరుతున్నారు. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే, రేపు ఇదే పరిస్థితి మరిన్ని గ్రామాలకు వ్యాపించే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.

అక్రమాలకు ఆదర్శమవుతున్న గ్రామం..

ఇకనైనా జిల్లా పరిపాలన, రెవెన్యూ, పంచాయతీ, టౌన్ ప్లానింగ్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక సమగ్ర విచారణ చేపట్టి, జానకంపేట్‌లో జరుగుతున్న భూ కబ్జాలు, అక్రమ వెంచర్లు, అనుమతులు లేని నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేదంటే జానకంపేట్, జిల్లాలోనే ఆక్రమణల ఆదర్శ గ్రామంగా మిగిలిపోతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment