|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలానికి చెందిన HG-296 శివరాం జూన్ నెలలో విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దురదృష్టవశాత్తు మరణించారు. ఈ నేపథ్యంలో శివరాం కుటుంబానికి పోలీస్ శాఖ తరఫున రూ.20,000/- ఆర్థిక సాయం మరియు తోటి పోలీస్ సిబ్బంది స్వచ్ఛందంగా సేకరించిన రూ.1,03,701/- సహాయం కలిపి మొత్తం రూ.1,23,701/- విలువైన రెండు చెక్కులను జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఎస్పీ శివరాం పెద్ద కుమారుడు ట్రిపుల్ ఐటీ చెన్నైలో చదువు పూర్తి చేసినందుకు అభినందనలు తెలిపారు. పోలీస్ కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఉన్నా తెలియజేయాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, ఆర్ఐ శైలేందర్, ఆర్ఎసై నరేష్, శ్రవణ్, కుటుంబ సభ్యులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.








