|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పురపాలక కమిషనర్ ఏ. రాజు లంచం కేసులో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (అనిశా) అధికారులకు పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుడు నిర్మించిన నూతన బహుళ అంతస్థుల భవనానికి ఇంటి నంబర్ కేటాయించేందుకు కమిషనర్ రూ.20,000 లంచం కోరినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ మొత్తాన్ని కమిషనర్ ప్రైవేట్ డ్రైవర్ భూమేష్ ద్వారా స్వీకరిస్తుండగా అనిశా అధికారులు రంగంలోకి దిగి పట్టుకున్నారు. తదుపరి పరిశీలనలో భూమేష్ వద్ద లెక్కలు చెప్పని రూ.4,30,000 నగదు కూడా స్వాధీనం చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ సేవకులు ఎవరైనా లంచం అడిగినట్లయితే వెంటనే ప్రజలు తెలంగాణ అవినీతి నిరోధక శాఖ టోల్‌ఫ్రీ నంబర్ 1064 కు కాల్ చేయాలని అధికారులు సూచించారు. అదేవిధంగా వాట్సాప్ (9440446106), ఫేస్‌బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB) మరియు వెబ్‌సైట్ (acb.telangana.gov.in) ద్వారా కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు. ఫిర్యాదుదారుల వివరాలు పూర్తి రహస్యంగా ఉంచబడతాయని అనిశా భరోసా ఇస్తోంది.








