|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో సంచలనం రేపిన కన్న కూతురిపై అత్యాచారం కేసులో నిందిత తండ్రికి ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.30,000 జరిమానా విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు ఇచ్చింది. ఏడాదిలోపే ఈ కేసు విచారణ పూర్తి అయి నిందితుడికి కఠిన శిక్ష పడడం విశేషం.
తేదీ 21.01.2025న బాన్సువాడ ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల హెడ్మాస్టర్ సూర్యదేవర విజయభారతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణలో బాధిత బాలిక తెలిపిన వివరాల ఆధారంగా తండ్రే నిందితుడని తేలడంతో, పోలీసులు POCSO చట్టం కింద అతనిని అరెస్ట్ చేశారు.
జిల్లా న్యాయమూర్తి CH. VRR వర ప్రసాద్ సాక్ష్యాధారాలు, వైద్య నివేదికలు పరిశీలించి నిందితుడికి శిక్ష విధించారు. కేసును విజయవంతంగా నిరూపించిన బాన్సువాడ DSP టి. సత్యనారాయణ, ప్రాసిక్యూటర్ శేషు, DSP యం. విట్టల్ రెడ్డి, కోర్ట్ సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేశ్ చంద్ర అభినందించారు.
జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ, “నేరం చేసిన వారు ఎవరూ చట్టం నుండి తప్పించుకోలేరు. పోలీసులు వేగవంతంగా దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యమని” పేర్కొన్నారు.








