|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలంలో మహిళా భద్రతకు సంబంధించిన కీలక కేసులో మహిళా కోర్టు కఠిన తీర్పు వెలువరించింది. 2023 ఏప్రిల్ 14న రెంజల్ మండల కేంద్రంలో గైని కిరణ్ కుమార్ స్థానిక వివాహిత మహిళ ఇంట్లోకి చొరబడి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
బాధితురాలు కేకలు వేయగా, ఆమె భర్త అక్కడికి చేరుకుని నిందితుడిని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ కిరణ్ అక్కడి నుండి పారిపోయాడు. వెంటనే బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాక్ష్యాలు, సాక్షుల వాంగ్మూలాలు పరిశీలించిన అనంతరం జిల్లా 4వ అదనపు మహిళా న్యాయస్థానం నిందితుడు దోషి అని తేల్చి, 3 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధించింది.

ఈ తీర్పు స్థానికుల్లో చర్చనీయాంశంగా మారింది. మహిళల భద్రత కోసం ఇటువంటి కఠిన శిక్షలు అవసరమని ప్రజలు అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో గైని కిరణ్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నాయకత్వం వహిస్తు ఇలాంటి దుశ్చర్యకు పాల్పడటంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
ఈ కేసు ద్వారా మహిళా భద్రతపై న్యాయవ్యవస్థ కఠినంగా వ్యవహరిస్తోందని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చట్టాలు అమలు కావాలని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.








