|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పక్కనే ఉన్న కాలువ పరిసరాల్లో చిరుత కనిపించడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. స్థానికుల సమాచారం ప్రకారం చిరుత ఓ కుక్కను నోట కరుచుకుని వెళ్లినట్లు గుర్తించారు.
ఈ ఘటనతో గ్రామస్థులు భయంతో రాత్రిళ్లు బయటకు రావడానికే జంకుతున్నారు. తక్షణమే అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను అదుపులోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
గత నెల రోజుల క్రితం కూడా జానకంపేట్ శివారులోని ఆనంతయ్య క్రషర్ సమీపంలో చిరుత సంచరిస్తోందని మేకల కాపరి రెండు మేకలను చిరుత ఎత్తుకెళ్లిందని సాక్ష్యాలతో వార్త కథనం ద్వారా అధికారులకు సమాచారం అందించిన, చిరుత అడుగులుగా భావించిన వాటిని నవిపేట్ జోన్ అటవీ శాఖ అధికారి అ ప్రాంతంలో పరిశీలన చెయ్యకుండానే కుక్క అడుగులుగా పేర్కొని తను ఉన్న చోటు నుండే నిర్ధారణ చేసి గ్రామస్థులకు సమాచారం అందించారు.
అధికారుల పని తీరు ఇదేనా అంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇకనైనా సంబంధిత అధికారులు అప్రమత్తమై చిరుతను బంధించి ప్రజలకు భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.








