|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలోని విజయ పాల డైరీ నిర్వాహకులు రైతుల సహకారంతో ధర్నా చేపట్టారు. ప్రతిరోజూ చిన్న పిల్లల నుంచి ముసలివారికి సైతం పాలు అందకపోతే వారి దినచర్య అశాంతంగా మారిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో విజయ డైరీ పాల బిల్లులను చెల్లించకపోవడంపై పాల కేంద్ర నిర్వాహకులు అధికారులను తీవ్రంగా విమర్శించారు.
మంగళవారం ధర్పల్లి మండల కేంద్రంలో విజయ డైరీ బిఎమ్ సియూ ముందు నిర్వహించిన ధర్నాలో గత మూడు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడం పై నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి పాడి రైతులు మరియు పాల కేంద్ర నిర్వాహకులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని వారు పేర్కొన్నారు.

పాల బిల్లులు చెల్లించకపోతే పాడి రైతులు తమ గేదెలకు దాన, తౌడుకు అవసరమైన ఖర్చులు ఎలా భరించగలరు అని ప్రశ్నిస్తు, ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే విజయ డైరీ సెంటర్లకు పాలు అందించడం కష్టమవుతుందని వారు హెచ్చరిస్తున్నారు.
గత 15 సంవత్సరాలలో ఇలాంటి పరిస్థితే కనిపించలేదని, పాల బిల్లుల చెల్లింపులు ఆపడం వల్ల పాడి రైతులు, సెంటర్ నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ తక్షణమే బిల్లులు చెల్లించకపోతే జిల్లా కలెక్టరేట్ ముట్టడికి సైతం వెనుకాడమని తెలిపారు.
ఈ ధర్నాలో గాండ్ల సంజీవ్, రాజారెడ్డి, లింగం, గణేష్, నరేందర్, శేఖర్, మానస, శ్రీకాంత్, సాయిలు, సుభాష్, రవీందర్, పవన్, సుదర్శన్, సత్యనారాయణ, గంగాధర్, దాసు, రవి తదితరులు పాల్గొన్నారు.








