|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో వరుస దొంగతనాలు రైతులను కలవరపెడుతున్నాయి. ఒక్క రాత్రిలోనే మూడు వేర్వేరు ప్రాంతాల్లో దుండగులు బీభత్సం సృష్టించడం స్థానికంగా ఆందోళన రేకెత్తించింది. ట్రాన్స్‌ఫార్మర్లలోని కాపర్ కాయిల్స్, కేబుల్స్, ఆయిల్ అపహరణతో రైతులు భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే, అలీ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కేంద్రంలో 630 KVA సామర్థ్యం గల రెండు ట్రాన్స్‌ఫార్మర్లను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అందులోని కాపర్ కాయిల్స్ మరియు ఆయిల్ దోచుకెళ్లారు. ఈ ఘటనతో పరిసర ప్రాంతాల రైతులకు విద్యుత్ సరఫరా అంతరాయం కలిగి, పంటలకు నీరు అందక ఇబ్బందులు తలెత్తాయి.
అదేవిధంగా తానాకాలన్ గ్రామ శివారులోని పంట పొలాల్లో బోరు మోటార్లకు చెందిన కేబుల్ వైర్లు దొంగిలించబడినట్లు రైతులు ఫిర్యాదు చేశారు. మరో ఘటనలో శ్రీదర్శనం సమీపంలోని వ్యవసాయ భూమిలో కూడా బోరు మోటార్ కేబుల్స్ అపహరించబడినట్లు వెల్లడైంది.
వరుసగా జరుగుతున్న ఈ దొంగతనాలపై పోలీసులు కేవలం ఫిర్యాదులు స్వీకరించడానికే పరిమితం అవుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చోటుచేసుకున్నాయని ఇప్పటివరకు ఇలాంటి దొంగతనాలపై చర్యలు కనబడలేదని ఇకనైనా తక్షణ చర్యలు తీసుకుని దొంగల ముఠాలను అరెస్ట్ చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ప్రకృతి విపత్తులతోనే కాకుండా పోలీసుల నిర్లక్ష్యంతో కూడిన భద్రతా లోపాలు కూడా తమను కుంగదీస్తున్నాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తు, వ్యవసాయ రంగానికి రక్షణ కల్పించాలని బాధితులు కోరుతున్నారు.








