|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలం, వడ్డేపల్లి గ్రామంలో మొరం రవాణాపై గ్రామస్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ శివారులో మొరం తవ్వకాలు నిర్వహిస్తూ గ్రామ ప్రధాన వీధుల నుండి అధిక లోడుతో ప్రమాదకరంగా టిప్పర్లను నడుపుతున్నారని స్థానికులు ఆరోపించారు.
ఇలా నిర్భయంగా రవాణా కొనసాగడం వల్ల గ్రామ రహదారులు దెబ్బతింటుయని, ప్రమాదాలు కూడా జరగవచ్చని గ్రామస్తులు భయపడుతున్నారు. మొరం వ్యాపారులను నిలదీసిన గ్రామస్థులకు వారికి అనుమతులు ఉన్నాయని సమాధానం ఇచ్చినప్పటికీ, సెలవు దినాల్లో ప్రభుత్వం ఎలా అనుమతులు ఇచ్చిందో స్పష్టత లేదని ప్రశ్నిస్తున్నారు.

గ్రామస్థులు ఎమ్మార్వోను ఫోన్ ద్వారా సంప్రదించేందుకు ప్రయత్నించినప్పటికీ స్పందన రాలేదని తెలిపారు. ఇలాంటి అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు తగ్గిపోతాయని, పర్యావరణానికి నష్టం కలుగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
సత్వరమే అధికారులు స్పందించి, వడ్డేపల్లిలో మొరం రవాణాను అరికట్టాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.








