|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో గంగాపూర్ చెరువు సమీపంలో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామాయంపేట వెళ్లే మార్గంలో డీసీఎం వాహనం ఆటోను ఢీకొనడంతో ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు ప్రమాదాన్ని గమనించి వెంటనే స్పందించారు.

తన వెంట ఉన్న క్యూ ఆర్ టీ (QRT) సిబ్బందిని తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఎస్పీ ఆదేశాలతో సిబ్బంది అక్బర్, హరీష్, యాదగిరి చాకచక్యంగా వ్యవహరించి క్షతగాత్రులను వాహనం నుంచి బయటకు తీశారు. అక్కడ ఒక్క స్ట్రెచర్ మాత్రమే అందుబాటులో ఉండటంతో, కాలు విరిగిన మహిళను కానిస్టేబుల్ యాదగిరి స్వయంగా చేతులపై ఎత్తుకుని అంబులెన్స్‌లో ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రమాదానికి గురైన వాహనాన్ని రోడ్డుపక్కకు జరిపి ట్రాఫిక్‌ను సాఫీగా సాగేందుకు చర్యలు తీసుకున్నారు. వేగంగా స్పందించి ప్రాణాలను కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు.








