|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండల పరిధిలోని ఓ గ్రామంలో మానవత్వాన్ని మట్టికరిపించే దారుణ ఘటన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు దారితీసింది. మానసిక వికలాంగురాలైన యువతిపై అత్యాచారం జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తడంతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బాధితురాలు నివసిస్తున్న అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ఇతియాజ్‌పై ఈ ఘాతుకానికి సంబంధించిన ఆరోపణలు నమోదయ్యాయి.
స్థానికుల వివరాల ప్రకారం, గత సోమవారం సాయంత్రం యువతి ఒంటరిగా ఉన్న సమయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు, ఆమెను బలవంతంగా ఆటోలో ఎక్కించి గ్రామ శివారుకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడని సంఘటనను గమనించిన గ్రామస్తులు అప్రమత్తమై వెంటనే స్పందించి బాధితురాలిని రక్షించినట్లు సమాచారం.

ఈ ఘటన వెలుగులోకి రావడంతో గ్రామ ప్రజలు ఆగ్రహావేశాలకు లోనై నిందితుడిపై కఠిన చర్యలు కోరుతూ,
బాధిత కుటుంబ సభ్యులు, సామాజిక ప్రతినిధులు బోధన్ రూరల్ సీఐ, ఎస్సైలను కలిసి ఫిర్యాదు అందజేసి, నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి చట్టపరమైన కఠిన శిక్ష విధించాలని కోరారు. వికలాంగుల రక్షణ చట్టం, ఎస్సీ/ఎస్టీ, అత్యాచార నిరోధక చట్టం, భారతీయ దండన చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ, పోలీసు వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా బాధితురాలికి సంపూర్ణ న్యాయం కల్పించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశీ, ఎమ్మార్పీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి లసింగారి భూమయ్య మాదిగ, బీజేపీ మండల అధ్యక్షుడు పసులోటి గోపి కిషన్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షుడు తాడం అబ్బాయ మాదిగ, భారతీయ ఎరుకల కులవృత్తుల సంఘం అధ్యక్షుడు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








