|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లాలో ఇసుక అక్రమ రవాణా మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఒకే వేబిల్లుతో నెలల పాటు ఇసుక రవాణా జరుగుతుండటం, సంబంధిత శాఖల నిర్లక్ష్యం, అధికారుల అనుమానాస్పద మద్దతు ప్రజల్లో ఆగ్రహాన్ని రేపుతోంది.
అధికారుల అవినీతికి పరాకాష్ట :
పోతాంగల్ నుండి వర్ని వరకు ఇసుకను రవాణా చేస్తున్న ట్రాక్టర్ డ్రైవర్లు చూపించిన వేబిల్లులో 07-03-2025 తేదీని కొట్టివేసి, పైగా 12-03-2025 గా మార్చినట్లు బయటపడింది. అదే వేబిల్లును తిరిగి మళ్ళీ 8 నెలల తర్వాత కూడా (15-11-2025) ఉపయోగిస్తూ ఇసుకను అక్రమంగా రవాణా చేయడం ఆశ్చర్యకరం, ఇది అధికారుల అవినీతి వల్ల కూడిన మౌనంతోనే సాధ్యమని ప్రజలు అంటున్నారు.
ఆర్టీసీ బస్సుల్లో మహిళలు చూపే ఆధార్ కార్డ్ వాలే వేబిల్లును చూపుతున్న అక్రమార్కులు – సరిగ్గా పరుశీలించని అధికారులు :
రవాణా నియంత్రణ బాధ్యత రెవెన్యూ, పోలీసులు, మైనింగ్ శాఖలపై ఉందని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అయితే వాస్తవానికి సంబంధిత అధికారులు వాహనాలతో పాటు వుండే వేబిల్లులను సరిగ్గా పరిశీలన జరగడం లేదు,
అనుమానాస్పద తేదీలు, ఎంట్రీలు పట్టించుకోవడం లేదు.
ఈ అక్రమ రవాణా గురించి సమాచారం అందుకున్న ఓ మీడియా ప్రతినిధి అక్రమ రవాణా ఆపాలని, పోతంగల్ ఎమ్మార్వో మరియు వర్ని ఎమ్మార్వో లకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడానికి ప్రయత్నించగా స్పందించకపోవడంతో అదే సమయంలో ఓ పోలీస్ అధికారితో సంప్రదించగా “ఇది నా డ్యూటీ మాత్రమేనా? ఏదైనా జీవో ఉందా?” అని జీవో చూపాలంటు సమాధానం ఇవ్వడం, అలాగే రాత్రి 9 గంటల తర్వాత కూడా కొనసాగుతున్న అక్రమ రవాణా “అన్ని అనుమతులతోనే జరుగుతోంది” అని సదరు పోలీస్ అధికారి చెప్పడం ప్రజల్లో తీవ్ర అనుమానాలు రేకెత్తించింది.
ప్రజాప్రతినిధులు, అధికారుల అండతో అక్రమార్కులు మీడియా ప్రతినిధులపై, స్థానిక ప్రజలపై దాడులకు పాల్పడడం అధికామవుతోంది.
ఈ పరిస్థితుల్లో “ఈ అక్రమాలను ఆపేది ఎవరు? ఈ అక్రమలపై సమాధానం చెప్పే అధికారులు ఉన్నారా?” అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
ఈ అక్రమాలపై ఉన్నత స్థాయి విచారణ అవసరం అని ప్రజల డిమాండ్ :
అవినీతి ఆరోపణలు, అధికారుల మౌనం, అక్రమ రవాణా పెరుగుతుండటంతో, ఉన్నతాధికారులు తక్షణ సమగ్ర విచారణ జరపి, ఈ అక్రమాలకు ఆజ్యం పోస్తున్న అధికారులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఈ విషయంలో ఉన్నతాధికారులు కూడా మౌనం వహిస్తే ఈ ప్రజా పాలన వ్యవస్థలో అధికార యంత్రంగానికి ప్రజల నుండి అవమానాలు తప్పవని హెచ్చరిస్తున్నారు.








