|| దృశ్యం న్యూస్ ||
అధికార లాంఛనాలతో అంతిమయాత్ర నిర్వహణ.

నిజామాబాద్‌లో హత్యకు గురైన సీసీఎస్ కానిస్టేబుల్ ఈ. ప్రమోద్ చివరి యాత్ర పోలీస్ శాఖ లాంఛనాల మధ్య శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో నార్త్ తెలంగాణ ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, మరియు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ప్రమోద్ మృతదేహాన్ని టౌన్ 3 పరిధిలోని న్యూ బ్యాంక్ కాలనీలో అంత్యక్రియల స్థలానికి తీసుకువెళ్లి, పోలీసులు గార్డ్ ఆఫ్ ఆనర్ సమర్పించారు. అధికార లాంఛనాల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది ప్రజలు, పోలీస్ శాఖ సిబ్బంది పాల్గొని కన్నీటి నివాళులు అర్పించారు.

అనంతరం ఐజీపీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ప్రమోద్ కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. “ప్రమోద్ తన విధి నిర్వర్తనలో వీరమరణం పొందాడు. ప్రమోద్ త్యాగం పోలీస్ శాఖకు గౌరవాన్ని తెచ్చింది,” అని ఐజీపీ అన్నారు.
అంత్యక్రియలలో అడిషనల్ డీసీపీ (అడ్మిన్) బస్వారెడ్డి, డీసీపీ (ఎ.ఆర్) రామచంద్రరావు, ఆర్మూర్, బోధన్, ట్రాఫిక్, సీటీసీ, సీసీఎస్ ఏసీపీలు, నగర సర్కిల్ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, పోలీస్ వెల్ఫేర్ సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కమిషనర్ పి. సాయి చైతన్య మాట్లాడుతూ – “ప్రమోద్ వంటి కర్తవ్యనిష్ఠులైన పోలీసు సిబ్బంది త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అని అతని సేవలను గుర్తుంచుకుంటాం” అన్నారు.










