మహిళా ఎన్నికల అధికారుల భద్రత పట్ల నిర్లక్ష్యం – జిల్లా ఉన్నతాధికారుల వైఫల్యంపై విమర్శలు.

|| దృశ్యం న్యూస్ ||

నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్సువాడ నియోజకవర్గాల్లో గురువారం నిర్వహించిన గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు విజయవంతంగా ముగిసినా, మహిళా ఎన్నికల అధికారులకు సరైన భద్రత కల్పించడంలో ఉన్నత అధికారుల ఘోర నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది. ఎన్నికలకు ఒక రోజు ముందు నుంచే విధుల్లో పాల్గొన్న మహిళా సిబ్బంది, విధులు ముగిసిన తర్వాత తమ స్వగ్రామాలకు వెళ్లే ప్రయత్నంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వచ్చినట్లు మహిళ అధికారులు వారి బ్కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గ్రామాలలో పోలింగ్, లెక్కింపు ప్రక్రియ సాయంత్రం 8 గంటలకే ముగిసినా, ఎన్నికల సామగ్రిని సంబంధిత మండల కార్యాలయాలకు తరలించడం, రికార్డుల ధృవీకరణ, అధికారులు సూచించిన అదనపు పనులు రాత్రి 11 గంటల వరకు సాగాయి. దీంతో దూర ప్రాంతాల నుంచి విధులకు వచ్చిన మహిళలు రాత్రివేళ తమ ఇళ్లకు బయలుదేరేలోపే పరిస్థితి పూర్తిగా ప్రతికూలమైంది.
ప్రత్యేకంగా 50 నుండి 70 కిలోమీటర్ల దూరం ఉన్న వారి నివాస గ్రామాలకు తిరిగి వెళ్లాల్సిన మహిళా సిబ్బందికి రాత్రి సమయాన వాహనాలు దొరకకపోవడం తీవ్ర ఆందోళనకు గురిచేసింది. చలికాలం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మహిళ సిబ్బంది అ రాత్రి సమయాల్లో రోడ్లపై నిలబడి వాహనాల కోసం వేచి చూస్తూ, చలితో వణుకుతూ ప్రయాణ సౌకర్యం కోసం గంటల తరబడి నిలబడి ఉండవలసిన పరిస్థితిని చూసిన స్థానికులు తీవ్ర ఆవేదన చెందారు.

కొంతమంది మహిళా సిబ్బంది రాత్రి ఆలస్యం అయిన కారణంగా సమీప గ్రామాల్లో వుండే తమ బంధువుల ఇళ్లకు వెళ్లి తాత్కాలికంగా ఆశ్రయం పొందగా, మరికొందరు బస్ స్టాండ్‌లలో, పబ్లిక్ ప్రాంగణాల్లో నిరాశ్రయంగా వేచి ఉండాల్సి వచ్చింది. ఇది మహిళా సిబ్బంది భద్రతపై ఉన్నత అధికారుల పూర్తిస్థాయి వైఫల్యాన్ని చాటుతున్నదని ప్రజలు మొఱ్ఱ పెడుతున్నారు.

ఎన్నికల వంటి కీలక ప్రక్రియలో మహిళా సిబ్బంది కీలక పాత్ర పోషిస్తుంటే, వారి రక్షణ, రవాణా సదుపాయాలపై జిల్లా ఉన్నతాధికారులు కనీసం ఆలోచించకపోవడం తీవ్ర విమర్శలకు కారణమైంది. రాత్రి సమయంలో మహిళలు సురక్షితంగా ప్రయాణించేలా ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేయకపోవడం అత్యంత బాధాకరమని వారి కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు.

భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యాలు పునరావృతం కాకుండా, మహిళా సిబ్బందికి రక్షణ చర్యలు, రాత్రివేళ ప్రయాణ సౌకర్యాలు, ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించాలని జిల్లా ఎన్నికల అధికారులను ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రాత్రి విధుల్లో పాల్గొన్న మహిళా సిబ్బంది తమ గృహాలకు సురక్షితంగా చేరేలా తక్షణ చర్యలు తీసుకోవడం అత్యవసరమని వారు స్పష్టం చేస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment