|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్ర శివారులో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బాన్సువాడ నుంచి బోధన్ వైపు వెళ్తున్న TS 22 T 3348 లారీ, బోధన్ నుంచి బాన్సువాడ వైపు వస్తున్న TG16 Z 0102 ఆర్టీసీ బస్సు రుద్రూర్ గ్రామ శివారులో ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో బస్సులో ప్రయాణిస్తున్న వారిలో తీవ్ర భయాందోళన నెలకొంది.

సమాచారం ప్రకారం, బస్సులో దాదాపు 50 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంలో 20 మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, కొందరికి తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. అలాగే బస్సు డ్రైవర్ మరియు లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు.

స్థానికులు 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించి, గాయపడిన వారిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న రుద్రూర్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంలో బస్సు, లారీ ముందుభాగాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటన రుద్రూర్ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.








