|| దృశ్యం న్యూస్ ||
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి, పాల్గొని మహిళా పోలీసు అధికారులు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం, కేక్ కట్ చేసి మహిళల హక్కులు, సమానత్వం, సాధికారతపై తన అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, తల్లిదండ్రులు తమ పిల్లలను సమానంగా చూడాలని, మగ పిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛను ఆడ పిల్లలకు కూడా కల్పించాలన్నారు. సమాజంలో మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం చాలా అవసరమని, ఏ రంగంలోనూ మహిళలు తక్కువకాదని, మహిళలు కేవలం వంటింటికే పరిమితం కాదని అన్ని రంగాల్లో ముందుకు సాగాల్సిన అవసరముందన్నారు.
మహిళా ఉద్యోగులు ఉద్యోగ బాధ్యతలతో పాటు, కుటుంబ బాధ్యతలని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడం అభినందనీయం అని, అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలనీ, ప్రతి మహిళ తన కుటుంబానికి వెన్నెముకవంటిది అని తెలిపారు.

మెదక్ జిల్లా పోలీస్ యంత్రాంగం మహిళల రక్షణ కోసం ప్రత్యేక చర్యలు చేపడుతోందని, ఆపద సమయాల్లో డయల్ 100 సేవలను వినియోగించుకోవాలని, మహిళలు నిర్భయంగా జీవించేందుకు పోలీస్ వ్యవస్థ ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందన్నారు.
అదేవిధంగా, సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో పురోగమించడమే నిజమైన అభివృద్ధి అని ఎస్పీ స్పష్టం చేశారు. మగ పిల్లలకు మహిళలను గౌరవించే విధంగా విలువలు నేర్పే బాధ్యత తల్లిదండ్రులు, గురువులపై ఉందని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఉత్తమ సేవలందించిన మహిళా పోలీసు అధికారులకు ప్రశంస పత్రాలు అందజేశారు.








