|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో మహిళపై లైంగిక దాడి చేసి హత్య చేసిన నిందితుడు పకీరానాయక్‌కు కోర్టు జీవిత ఖైదు మరియు రూ.15,000 జరిమానా విధించింది. ఈ ఘోర సంఘటన 2020 నవంబర్ 10న జరిగింది. వట్పల్లి మండలం సేవాలాల్ తండాకు చెందిన పకీరానాయక్ మెదక్ పట్టణంలో నంబర్ వన్ కళ్లు దుకాణం వద్ద ఓ మహిళతో పరిచయం ఏర్పరచుకుని ఆ తరువాత చేగుంట రోడ్ సమీపంలోని ధర్మకంట వద్దకు తీసుకెళ్లి ఆమెపై లైంగిక దాడి చేశాడు. అనంతరం డబ్బుల విషయంలో వాగ్వాదం చోటుచేసుకోగా, కోపంతో పకీరానాయక్ సీసా బాటిల్ పగలగొట్టి మహిళ గొంతు కోసి హత్య చేశాడు.
ఈ కేసును అప్పటి ఎస్ఐ పోచయ్య నమోదు చేసి, విచారణ అధికారిగా సీఐ ఏ. వెంకటయ్య సమగ్ర దర్యాప్తు నిర్వహించారు. ప్రస్తుత సీఐ మహేష్ సాక్ష్యాధారాలను కోర్టులో సమర్పించగా, ప్రభుత్వ న్యాయవాది వెంకటేష్ బలమైన వాదనలు వినిపించారు. కోర్ట్ అనుసంధాన అధికారి ఎస్ఐ విట్టల్, సీడీఓలు కృష్ణ, రామయ్య విచారణ ప్రక్రియలో కీలక పాత్ర పోషించారు.
న్యాయమూర్తి నీలిమ సాక్ష్యాలను పరిశీలించి నిందితుడికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు న్యాయం సాధనకు కృషి చేసిన పోలీసు సిబ్బందిని అభినందించారు.








