|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం బెక్నెల్లి గ్రామంలో పంచాయతీ కార్మికులు ఇద్దరు ప్రాణాలు కోల్పోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. రాంపూర్ సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ స్తంభాలను గ్రామ పంచాయతీ ట్రాక్టర్‌లో తరలిస్తుండగా కల్దుర్కి–సిద్ధాపూర్ మార్గంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో స్తంభాలు కార్మికులపై పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.

గ్రామస్థుల సమాచారం ప్రకారం, ట్రాక్టర్‌లో శక్తికి మించి 10 వరకు విద్యుత్ స్తంభాలు లోడ్ చేసినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్ డ్రైవర్, కార్మికులకు సరైన అనుభవం లేకపోయినా, పంచాయతీ కార్యదర్శి కాంట్రాక్టర్ కోసం ఈ పనులకు సిబ్బందిని పంపించడం స్థానికుల ఆగ్రహానికి కారణమైంది. అనుభవజ్ఞులైన కార్మికులను కాకుండా సాధారణ సిబ్బందిని వినియోగించడం నిర్లక్ష్యంగా వ్యవహరించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి.

మృతుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులు బాధ్యులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై విద్యుత్ శాఖ, స్థానిక అధికారులు మౌనం పాటించడం మరింత ఆగ్రహానికి కారణమవుతోంది.
గ్రామస్థులు, ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అధికారుల నిర్లక్ష్యం, కాంట్రాక్టర్ వైఫల్యం పై విచారణ జరిపి బాధ్యులను శిక్షించాలని కోరుతున్నారు.








