|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న మద్యం సిట్టింగ్ వసతి అడ్డాలు జిల్లాలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి.
బార్‌ల మాదిరిగా సిట్టింగ్ వసతి ఏర్పాట్లు చేసి, అక్రమంగా మద్యం విక్రయం, అన్ని రకాల ఆహార పదార్థాలతో ఈ అడ్డాలకు జిల్లా నలుమూలల నుండి ఎంతోమంది మద్యం ప్రియులు ఈ గ్రామానికి తరలివస్తుండటంతో గ్రామ ముఖచిత్రమే మారిపోయింది.
ఈ అడ్డాలపై స్థానికంగా ఇదేవరకే అనేక ఫిర్యాదుల సమాచారంతో పోలీస్ అధికారులు పలుమార్లు దాడులు జరిపినా, ఈ ప్రాంతంలో ఎలాంటి శాశ్వతమైన పరిష్కారం కనిపించడం లేదు.
ఈ అక్రమ సిట్టింగ్ కేంద్రాలతో సమీప నివాసితులకు శాంతిభద్రత సమస్యలతో పాటు అసహన పరిస్థితులు సృష్టిస్తున్నాయి. జిల్లా పోలీస్ కమిషనర్ ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ, కుర్నపల్లి గ్రామంలో మాత్రం అక్రమ కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయి.
ఈ సిట్టింగ్ అడ్డాల వెనుక అధికారుల మౌన ప్రమేయం ఉందనే ఆరోపణలు, సిట్టింగ్ నిర్వాహకులకు సంబంధిత అధికారులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారన్న చర్చ స్థానికుల్లో బలంగా వినిపిస్తున్నాయి.
ఇలాంటి మద్యం విక్రయ సిట్టింగ్ కేంద్రాలు యువత భవిష్యత్తుకు ముప్పు కలిగిస్తూ, గ్రామాల్లో సామాజిక సమస్యలను పెంచుతున్నాయి. ప్రజల భద్రత, గ్రామ శాంతి కోసం అధికారులు తక్షణ కఠిన చర్యలు తీసుకొని ఈ అక్రమ మద్యం సిట్టింగ్ వసతులను శాశ్వతంగా మూసివేయాలి అని, లేదంటే అధికారులపై ప్రజల్లో నమ్మకం కోల్పోయే పరిస్థితి తలెత్తుతుంది అని పలువురు హెచ్చరిస్తున్నారు.








