|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండలంలోని గోవింద్‌పల్లి గ్రామ చెరువులో అనుమతులు లేకుండా గత మూడు రోజులుగా జేసీబీ, ట్రాక్టర్ల సహాయంతో అక్రమంగా మొరం త్రవ్వకాలు కొనసాగుతున్న ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ అక్రమాలపై స్థానికులు ఎండగట్టిన తగు చర్యలపై సంబంధిత అధికారుల స్పందన, వ్యవహార శైలి పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

ఈ ఘటనపై అనుమతుల గురించి ఇరిగేషన్ అధికారికి వివరాలు తెలుసుకునే ప్రయత్నంలో మొదట అనుమతి ఇచ్చినట్టు, తర్వాత ఇవ్వలేదని వ్యాఖ్యానించడం గమనార్హం. దీనిపై ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. అక్రమ త్రవ్వకాలకు పాల్పడుతూ కొంతమందికి డబ్బులు ఇచ్చి ప్రలోభాలకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారు అని, ఈ అక్రమాలను బయటపెట్టిన స్థానికలపై బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం.

గత మూడు రోజులుగా ఈ అక్రమ రవాణా కొనసాగడంపై ప్రముఖ వార్త పత్రికలో కథనం ప్రచురితం కావడంతో ధర్పల్లి సీఐ స్పందించి జేసీబీని స్వాధీనం చేసుకుని తదుపరి చర్యల నిమిత్తం ఎమ్మార్వోకి అప్పగించడం జరిగిందని తెలిపారు, అ చర్యల పూర్తి వివరాలు అడుగగా పౌర సమాచార హక్కు చట్టం ద్వారా మాత్రమే ఇవ్వగలమని పోలీసులు నిర్లక్ష్యంగా జవాబు ఇస్తున్నారని స్థానికులు తెలిపారు. ఈ ఘటన మరుసటి రోజే మొరం త్రవ్వకాలు మళ్లీ ప్రారంభమవడం చూస్తే అధికారుల అండ స్పష్టంగా ఉన్నట్లు అనుమానం మరింత బలపడుతోంది.
ఈ తవ్వకాలకు అడ్డు చెప్పే వారికి మేము అధికార పార్టీ నేతలము అంటూ ఈ అక్రమాలను జరుపుతుండటం పట్ల స్థానికులు మండిపడుతున్నారు. ఈ విషయమై రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తక్షణమే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు ఆగకపోతే స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీకి తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని పలువురు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.








