|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ (PDS) బియ్యం అక్రమ నిల్వలు, రవాణాపై పోలీసులు భారీ స్థాయిలో మెరుపు దాడులు నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి. సాయి చైతన్య, ఐపీఎస్ ఆదేశాల మేరకు, సీసీఎస్ ఇన్‌చార్జ్ ఏసీపీ మస్తాన్ అలీ/మస్తాన్ వాలి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం బుధవారం బోధన్ పట్టణం మరియు బోధన్ రూరల్ పరిధిలో సమన్వయంతో తనిఖీలు చేపట్టింది.

పోలీసుల వివరాల ప్రకారం, బుధవారం నిర్వహించబడిన దాడుల్లో బోధన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ బస్ స్టాండ్ సమీపంలోని రైస్ డిపోలో 40 బస్తాల పీడీఎస్ బియ్యం పట్టుబడగా, వాటి అంచనా విలువ రూ.45,000గా గుర్తించారు. అదే విధంగా పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలోని మరో రైస్ డిపోలో 55 బస్తాల పీడీఎస్ బియ్యం స్వాధీనం చేసుకోగా, వాటి విలువ రూ.55,000గా అంచనా వేశారు.
అదేవిధంగా, పోస్ట్ ఆఫీస్ పరిధిలోని టాటా ఏప్ వాహనం (AP 25 W 1481) లో 150 కిలోల పీడీఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, సుమారు రూ.5,000 విలువైన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు వాహనాన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు.

ఇక బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో ఉన్న శ్రీ రాఘవేంద్ర బిన్నీ రైస్ మిల్‌లో భారీ స్థాయిలో తనిఖీలు నిర్వహించిన సీసీఎస్ బృందం, సుమారు 450 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుంది. అలాగే TS16T 0397 నంబర్ గల టాటా ఏప్ ఆటోను కూడా సీజ్ చేశారు. పట్టుబడిన బియ్యం, వాహనాలను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం బోధన్ టౌన్ మరియు బోధన్ రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌వోలకు అప్పగించారు.
ఈ దాడితో బోధన్ నియోజకవర్గ పరిధిలోని గత వారం రోజుల వ్యవధిలో దాదాపు 700 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పోలీస్ శాఖ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగిందని సమాచారం.
ప్రభుత్వ పథకాల ద్వారా పేదలకు చేరాల్సిన బియ్యాన్ని అక్రమంగా మళ్లించి నిల్వలు, రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. బోధన్‌లో పీడీఎస్ బియ్యం అక్రమ వ్యాపారం వెనుక పెద్ద నెట్‌వర్క్ పనిచేస్తోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు లోతైన దర్యాప్తు కొనసాగిస్తున్నారు.








