|| దృశ్యం న్యూస్ ||
కామారెడ్డి జిల్లా, బాన్సువాడ పట్టణంలోని రిలయన్స్ మార్ట్ లో జరిగిన ఘటనాతో మొదలై ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న అల్లర్లుతో బాన్సువాడ పట్టణ వీధుల్లో భయంకర వాతావరణం నెలకొంది. ఓ మహిళ పట్ల ఓ యువకుడు ప్రవర్తించిన తీరుపై ఈ ఘటన చోటు చేసుకుంది అని,
ఈ అల్లర్లలో కొన్ని దుకాణ సముదాయాలు ధ్వంసం అయ్యాయి, పలువురికి గాయాలు కూడా అయ్యాయి ఈ ఘటనపై సంబంధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే జిల్లా ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమగ్రంగా సమీక్షించారు. ప్రస్తుతం బాన్సువాడ పట్టణంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ప్రత్యేక పోలీసు బలగాలను మోహరించి, ప్రధాన కూడళ్ల వద్ద పికెట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ అనుమానాస్పద కదలికలపై నిఘా పెంచారు. ప్రజల్లో భయాందోళనలు లేకుండా చట్టవ్యవస్థను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు.
ఇక సోషల్ మీడియాలో అసత్య ప్రచారం, విద్వేషపూరిత పోస్టులు, వదంతుల వ్యాప్తిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముఖ్యంగా WhatsApp, Facebook, X వంటి వేదికలపై తప్పుడు సమాచారం పంచేవారిని సైబర్ విభాగం గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రజలు అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని, వదంతులను నమ్మి ఉద్రిక్తతలకు లోనుకాకుండా శాంతి భద్రతలకు సహకరించాలని జిల్లా పోలీసు శాఖ విజ్ఞప్తి చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చట్టాన్ని చేతిలోకి తీసుకునే వారిపై రాజీ లేకుండా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు.








