|| దృశ్యం న్యూస్ ||
“బార్‌ను తలపిస్తున్న మద్యం సిట్టింగ్ అడ్డా, మద్యం ప్రియులకు అన్ని రకాల వసతులు” అని గత కొన్నిరోజుల క్రితం దృశ్యం న్యూస్ పూర్తి వివరాలతో కథనం ప్రచురించిన అధికారుల నుండి తగు చర్యల ఫలితాలు శూన్యం.
“కుర్నపల్లిలో మద్యం అక్రమ రాజ్యం”
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం కుర్నపల్లి గ్రామంలో అక్రమ మద్యం సిట్టింగ్ కేంద్రం బార్‌ను తలపించే స్థాయిలో కొనసాగుతున్న సంబంధిత శాఖల అధికారులు పూర్తిస్థాయిలో మౌనం వహించడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. అనుమతులు లేకుండా మద్యం విక్రయాలు, ఉమ్మడి జిల్లాల నలుమూలల నుండి మద్యం ప్రియులకు ఆహ్వానిస్తూ, అన్ని వసతులు కల్పిస్తూ అర్థరాత్రుల వరకు సాగుతున్న అక్రమ కార్యకలాపాలపై ఎన్నో వార్తా కథనాలు వెలువడినప్పటికీ, ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అధికారులు అవినీతికి పాల్పడ్డారని అనే ఆరోపణలకు వారి నిర్లక్ష్యానికి మరో నిదర్శనంగా మారింది.
కుర్నపల్లి గ్రామానికి చెందిన పరుశురాం అనే వ్యక్తి పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న మద్యం అక్రమ సిట్టింగ్ కేంద్రం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నా, అర్ధరాత్రి వేళలో సైతం మద్యం సేవించిన వారి అల్లరి, గొడవలు, అసభ్య ప్రవర్తనలతో గ్రామంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని వాపోతున్నారు. అయినా అధికారులు ఈ అక్రమ కేంద్రం వైపు కళ్లెత్తి చూడకపోవడం వెనుక అధికారుల అవినీతి ప్రమేయం ఉందన్న ఆరోపణలు స్పష్టంగా బలంగా వినిపిస్తున్నాయి.
మౌనమే అధికారుల విధానం – గ్రామ భద్రతకు ముప్పు.

ఈ కేంద్రంలో బాల కార్మికులతో మద్యం ప్రియులకు అన్ని విధాలా మర్యాదలు అందిస్తున్నా కార్మిక శాఖ అధికారులు స్పందించకపోవడం మరింత ఆందోళన కలిగించే విషయం, అలాగే ఆహార భద్రత నియమాలను, నిబంధనలను పూర్తిగా నిరుగారుస్తూ “నాకు అడ్డెవరు” అన్నట్టుగా ప్రవర్తిస్తున్న నిర్వాహకుడి ధిక్కార ధోరణి అధికారుల అండదండల ఫలితమేనని గ్రామస్థులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు.
మద్యం మాఫియాకు రాజకీయ రక్షణ కవచం.
ఇంకా తీవ్ర విషయం ఏమిటంటే, ఈ అక్రమాలపై వార్తా కథనం రాసిన విలేకరిని నిర్వాహకుడికి వత్తాసు పలుకుతూ ఓ పార్టీ నాయకుడు బెదిరించిన సంఘటన వార్త రూపంలో వెలుగులోకి వచ్చిన అధికారులు మాత్రం అంధకార ధోరణి అవలంభిస్తున్నారు.
నిర్వాహకుడు, నిర్వాహకుడికి అండగా నిలిచే నాయకుల ప్రవర్తన శైలి వల్ల గ్రామస్థులు ఈ కేంద్రంపై ఫిర్యాదులు చెయ్యడానికి భయపడుతున్నారని ఆ భయంతోనే నిశ్శబ్దంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది అని సమాచారం.
ఆబ్కారీ శాఖ ప్రజల భద్రతను పక్కనబెట్టి మద్యం ద్వారా ప్రభుత్వం పొందే ఆర్థిక లాభాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి, ప్రభుత్వ ఆర్థిక లాభాలు ఏమో కాని, అధికారులకు అక్రమ ఆర్థిక లాభాలు చేకూరుతున్నాయని సమాచారం, అలాగే పోలీస్ అధికారులు సైతం ఆబ్కారీ అధికారులనే అనుసరిస్తూరాని, పెట్రోలింగ్ వాహనాలు ఈ అక్రమ కేంద్రం వైపు కనీసం కనిపించకపోవడంపై అధికారుల పాత్రపై అనేక అనుమానాలను మరింతగా బలపరుస్తోంది. జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ కేంద్రానికి అనుకూలంగా వ్యవహరిస్తు సకల అతిధ్యలు స్వీకరిస్తున్నారనే ప్రచారం ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని రేపుతోంది.
కుర్నపల్లి గ్రామాన్ని అదుకోవాల్సింది ఎవరు?
ఏదిఏమైనా అధికారుల మాత్రం ఈ కేంద్రంపై ఏవిధమైన చర్యలు తీసుకోరు అని స్పష్టంగా అర్థమవుతోంది, కనీసం నూతనంగా ఏర్పడిన గ్రామ పాలకులు అయిన స్పందించి గ్రామ ప్రజల భద్రతను దృష్టిలో పెట్టుకుని ఈ అక్రమ సిట్టింగ్ కేంద్రంపై కఠిన చర్యలు తీసుకుంటారా? లేక అధికారుల మాదిరే అక్రమాలను ప్రోత్సహిస్తారా? అనే ప్రశ్నకు సమాధానం కోసం కుర్నపల్లి ప్రజలు వేచిచూస్తున్నారు.








