|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా వ్యాప్తంగా అక్రమ మద్యం వ్యాపారాలపై పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. మనోహరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కళకల్ల గ్రామంలో ప్రభాకర్ గౌడ్ కిరాణా షాప్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం అందడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. దాడిలో దాదాపు 150 లీటర్ల అక్రమ మద్యం స్వాధీనం చేసుకొని, నిందితుడిని మద్యం సహా మనోహరాబాద్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించి చట్టపరమైన చర్యలు చేపట్టారు.
ఇక నిన్న రాత్రి తిమ్మనగర్ గ్రామంలో 76 లీటర్ల మద్యం స్వాధీనం కాగా, ఈ రోజు మరో 150 లీటర్లు పట్టుకోవడంతో మొత్తం 226 లీటర్ల అక్రమ మద్యం పట్టుబడింది. 24 గంటల్లో రెండు వరుస దాడులు జరగడంతో మెదక్ జిల్లాలో ఇది చర్చనీయాంశంగా మారింది.
జిల్లాలో అక్రమ మద్యం రవాణా, నిల్వ, విక్రయాలపై టాస్క్ ఫోర్స్ సిబ్బంది పహారా కట్టుదిట్టం చేశారు. ఈ చర్యలతో మద్యం మాఫియా గుంపులు భయాందోళనకు గురవుతున్నాయి.
జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు, మాట్లాడుతూ – “చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించం అంటూ అక్రమ మద్యం వ్యాపారులు కఠిన శిక్షలకు గురవుతారు అని, ప్రజలు కూడా ఇలాంటి అక్రమాలపై సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలి” అని విజ్ఞప్తి చేశారు.








