|| దృశ్యం న్యూస్ ||
ధర్పల్లి: దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పటాకుల షాపుల యజమానులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఎస్సై కళ్యాణి మాట్లాడుతూ, పటాకుల విక్రయ దుకాణాలు తప్పనిసరిగా Explosives Act, 1884 మరియు Explosives Rules, 2008 ప్రకారం చెల్లుబాటు అయ్యే లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. లైసెన్స్ దుకాణంలో స్పష్టంగా ప్రదర్శించాల్సిందిగా తెలిపారు.
అలాగే, షాపులు నివాస గృహాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, పెట్రోల్ బంకులు వంటి ప్రదేశాలకు సురక్షిత దూరంలో ఉండాలని చెప్పారు. విద్యుత్ మరియు అగ్నిమాపక శాఖ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని సూచించారు. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు కలిగిన వారికి పటాకులు అమ్మరాదని హెచ్చరించారు.
దుకాణాల్లో మంట నియంత్రణ పరికరాలు, ఇసుక బకెట్లు, ఫైర్ ఎక్స్టింగ్విషర్లు, నీటి వనరులు తప్పనిసరిగా ఉండాలని తెలిపారు. షాప్ లోపల లేదా సమీపంలో పటాకులు పేల్చడం కఠినంగా నిషేధం. నిబంధనలు ఉల్లంఘించిన పక్షంలో లైసెన్స్ రద్దు, స్టాక్ స్వాధీనం, మరియు చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్సై కళ్యాణి హెచ్చరించారు.








