|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో వీరనారి చాకలి ఐలమ్మ 130వ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రధాన అతిథిగా పాల్గొని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణలోని మహనీయుల జయంతి కార్యక్రమలను ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోందని, చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ఆమె త్యాగాలను స్మరించుకోవడం గర్వకారణమని అన్నారు. నిజాం పాలకులు, జమీందారులు, జాగిర్దారుల వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమని గుర్తుచేశారు.
ఆమె పోరాటం ఫలితంగా భూసంస్కరణలు అమలులోకి వచ్చి భూమి పేదలకు పంపిణీ జరిగిందని కలెక్టర్ వివరించారు. భావితరాలు చాకలి ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకొని సమాజాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, రజక సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.








