|| దృశ్యం న్యూస్ ||
యూజీసీ నూతన ముసాయిదా – 2025ను రద్దు చేయాలని, విశ్వవిద్యాలయాల స్వాయం ప్రతిపత్తిని పరిరక్షించాలని, విద్యార్థుల హక్కుల సాధన కోసం పోరాడాలని డిమాండ్ చేస్తూ PDSU విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో మార్చి 18న కాకతీయ విశ్వవిద్యాలయంలో యూనివర్సిటీ విద్యార్థుల రాష్ట్ర సదస్సు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సదస్సు కరపత్రాలు ఆవిష్కరించారు.
విద్యా వ్యవస్థపై ప్రభుత్వాల దుష్ప్రభావం :
ఈ సందర్భంగా PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయాలు విద్యార్థుల విజ్ఞాన అభివృద్ధికి, నూతన ఆలోచనలకు కేంద్రబిందువులుగా ఉండాలని అన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జాతీయ విద్యా విధానం 2020 మరియు యూజీసీ ముసాయిదా 2025 విద్యా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. విశ్వవిద్యాలయాల స్వాయం ప్రతిపత్తిని దెబ్బతీసే విధంగా కేంద్రం ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని, విద్యను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని విమర్శించారు.
విద్యను ప్రైవేటీకరిస్తున్న కేంద్ర ప్రభుత్వం :
నేడు ప్రభుత్వ యూనివర్సిటీల్లో సరిపడా నిధులు లేక పరిశోధన అభివృద్ధి ఆగిపోయిందని, పేద విద్యార్థుల హక్కులు హరించబడుతున్నాయని, ప్రభుత్వాలు విద్యను వ్యాపారంగా మార్చిన కారణంగా సామాన్య విద్యార్థులకు నాణ్యమైన విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సుల పేరుతో ఫీజులు పెంచి, పేద విద్యార్థులకు హాస్టల్ వసతులు అందకుండా చేయడం విద్యావ్యతస్థను ధ్వంసం చేసే చర్యలుగా అభివర్ణించారు.
మార్చి 18 సదస్సును విజయవంతం చేయండి :
కాకతీయ విశ్వవిద్యాలయంలో జరగనున్న PDSU రాష్ట్ర విద్యార్థి సదస్సుకు విద్యార్థులు, మేధావులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.విద్యా వ్యవస్థను కార్పొరేట్లకు అప్పగించకుండా, ప్రభుత్వ విద్యను రక్షించేందుకు ప్రతి విద్యార్థి చైతన్యవంతులై సమిష్టిగా పోరాటం చేయాలని PDSU నాయకులు కోరారు.








