|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఉగాది పచ్చడిలా షడ్రుచులు ఆస్వాదిస్తూ శాంతి, సౌభాగ్యంతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం ఉగాది, ముస్లిం సోదరుల పవిత్ర మాసం రంజాన్ ఏకకాలంలో వస్తున్నాయని, మత సామరస్యం కాపాడడం అందరి బాధ్యత అన్నారు. కుల, మతాలకు అతీతంగా పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
సంఘవిద్రోహ శక్తులు మతవిద్వేషాలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, సోషల్ మీడియాలో అశాంతి కలిగించే పోస్టులు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం పండుగల సందర్భంగా కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలిపారు.








