|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పరిశీలించారు. ఆసుపత్రిలో ఓపీ రిజిస్టర్‌ను తనిఖీ చేసి రోగులకు అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో వైద్య ప్రమాణాలు మెరుగవుతున్నాయని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యాధునిక పరికరాలు, మౌలిక సదుపాయాలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కార్పొరేట్ స్థాయిలో మెరుగైన వైద్యం అందించేందుకు వైద్యులు, సిబ్బంది కృషి చేస్తున్నారని కొనియాడారు.

ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. ఇన్‌పేషెంట్ వసతుల విషయంలో బెడ్లు, బెడ్‌షీట్లు, మరుగుదొడ్లు మెరుగుపరిచినట్టు వివరించారు. ఆరోగ్య మహిళా కార్యక్రమాన్ని క్లస్టర్ విధానంలో విస్తరించి, సదూర ప్రాంత మహిళలకు సేవలు అందించేందుకు చర్యలు చేపట్టినట్టు చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.








