|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్‌లోని SR ఇంటర్ కళాశాల లెక్చరర్ గణేష్ మైనర్ బాలికపై శారీరక వేధింపులకు పాల్పడిన ఘటనపై తెలంగాణ విద్యార్థి పరిషత్ జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తమైంది. నిందితుడి దిష్టిబొమ్మ దహనం చేసి వెంటనే రిమాండ్ చేయాలని డిమాండ్ చేశారు.

జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిని కళాశాలకు పిలిపించి సంఘటనను వివరించారు, ఇటీవల కార్పొరేట్ కళాశాలల్లో కామాంధులైన లెక్చరర్ల వేధింపులు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి లెక్చరర్ల కారణంగా విద్యా వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటోందని, బాలికలు భయంతో మౌనం పాటించి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి వస్తోందని పేర్కొన్నారు.

ప్రతి తరగతిలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, గర్ల్స్ క్యాంపస్‌లో మహిళా సిబ్బందినే నియమించాలని సూచించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ కళాశాలలు విద్యార్థినుల రక్షణలో విఫలమవుతున్నాయని, ఈ ఘటనకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వినయ్, కార్యకర్తలు ధర్మేందర్, సిద్ధు, మహేష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు.








