|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు సిబ్బందికి సమగ్రమైన అవగాహన అవసరమని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు.

సోమవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలు, నోడల్ అధికారులకు ఎన్నికల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, నామినేషన్ల స్వీకరణ నుంచి లెక్కింపుల వరకు ప్రతి దశలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
అభ్యర్థుల అర్హతలు, గుర్తులు కేటాయింపు, నామినేషన్ల ఉపసంహరణ, పోలింగ్ మెటీరియల్ పంపిణీ, స్ట్రాంగ్ రూమ్ ఏర్పాట్లు, పోలింగ్ కేంద్రాల నిర్వహణ వంటి అంశాల్లో స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. ఎన్నికల నిబంధనలను కచ్చితంగా పాటించి పారదర్శకంగా నిర్వహించాలన్నారు.
ఎన్నికల ప్రక్రియలో అనిశ్చితి లేకుండా సిబ్బంది ముందుగానే శిక్షణ పొందితే తప్పులు నివారించవచ్చని ఆయన సూచించారు. అనంతరం మాస్టర్ ట్రైనర్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ నగేష్, డీఆర్ఓ భుజంగరావు, జెడ్పీ సీఈవో ఎల్లయ్య, ఆర్డీవోలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.








