|| దృశ్యం న్యూస్ ||
కోనోకార్పస్ మొక్క, అమెరికా ఖండంలోని తీర ప్రాంతానికి చెందినదిగా పరిగణించబడుతుంది. ఇది ముఖ్యంగా ఫ్లోరిడాలోని మాంగ్రూవ్ జాతికి చెందిన మొక్కగా పరిచయమవుతుంది. కానీ ఇతర దేశాలలో ఈ మొక్కను నాటటం అనేక దుష్ప్రభావాలను కలిగిస్తుందని గమనించబడింది.
కోనోకార్పస్ మొక్కల ఉపయోగాలు,సమస్యలు:

ప్రపంచవ్యాప్తంగా, కోనోకార్పస్ మొక్కలను ముఖ్యంగా ఆకర్షణీయమైన దృశ్యం కోసం నాటారు, ఇది బండరాళ్లతో కూడిన ప్రదేశాలలో మాములు మొక్కల కంటే త్వరగా పెరగడం వలన హరిత వాతావరణాన్ని అందించడంలో సహాయపడుతుంది అని, అరబ్, మద్యప్రాచ్య దేశాలలో ఎడారి దుమ్ము మరియు ఇసుక తుఫాన్ల వల్ల వచ్చే చిన్న చిన్న ఇసుక రేణువులను అదుపు చేసేందుకు ఈ మొక్కలు పెంచడం మొదలు పెట్టారు.
వృక్ష శాస్త్ర నిపుణులు హెచ్చరిక :
ఈ మొక్క భారతదేశంలో వాతావరణ సంబంధిత దుష్ప్రభావాలను కలిగిస్తుందని వృక్ష శాస్త్ర నిపుణులచే గమనించబడింది. కోనోకార్పస్ మొక్కకు అందం మరియు ఆకర్షణ మాత్రమే ఉంటాయి, ఈ మొక్క యొక్క పండ్లు, పుష్పాలు వాడుకకు పనికిరాదు, కనీసం పక్షులు కూడా గూడు కట్టేందుకు ఇష్టపడవు. భూగర్భ జలాలను అధికంగా వినియోగించడం, మానవ ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తూ అనేక అనారోగ్య సమస్యలను తీసుకురావడం, ఇవన్నీ ఈ మొక్కల ప్రతికూలతలు అని నిపుణులు తెలుపుతున్నారు.
మానవ ఆరోగ్యం పై వీటి ప్రభావం :

వృక్షశాస్త్ర నిపుణుల అంచనాల ప్రకారం, కోనోకార్పస్ మొక్కల కారణంగా మానవులలో శ్వాస సంబంధ వ్యాధులు, అనేక రకాల ఎలర్జీలు ఎదురవుతున్నాయని, ఈ మొక్కల పొడి ఆకులు మరియు పుష్పాలు ఎక్కువగా ఎలర్జీని ప్రేరేపిస్తాయి అని, దీనివల్ల ప్రజలు అనేక ఆరోగ్య సమస్యలకు గురవుతున్నారాని తెలుపుతున్నారు.
తక్షణమే నిర్ములన ప్రారంభించాలి :
తెలంగాణలో గత కొన్నిరోజుల క్రితం కోనోకార్పస్ మొక్కలు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ హరితహారం కార్యక్రమంలో భాగంగా, ఈ మొక్కలు ప్రభుత్వ కార్యాలయాల సమీపంలో, రోడ్ల డివైడర్ల మధ్య పెంచారు, ఇప్పుడు ఈ మొక్కలు ఏపుగా దట్టంగా పెరిగి ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, కానీ వాటి దుష్ప్రభావాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వాటి నిర్ములన చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రస్తుతం, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మొక్కలను తొలగించాలని మరియు వాటి స్థానంలో వేరే మొక్కలను నాటాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇది కేవలం ప్రభుత్వ చర్యలు మాత్రమే కాదు, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు కూడా ఒక దశగా భావించబడింది.
ఈ సందర్భంగా వృక్ష శాస్త్ర నిపుణులు తెలంగాణ ప్రభుత్వం ఈ మొక్కల నిర్ములన చేపట్టే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేసి కోనోకార్పస్ మొక్కలకు బదులు వాటి స్థానంలో స్థానిక స్వదేశీ మొక్కలను నాటడం ద్వారా ప్రాంతీయ పర్యావరణాన్ని మెరుగుపరచవచ్చని తెలియచేస్తున్నారు.
ప్రభుత్వం నుండి ఆదేశాలు లేకున్నా స్థానిక అధికారులు సంబంధిత కార్యాలయాల్లో ఈ మొక్కలు ఉన్నట్లయితే తక్షణమే తొలగించే ప్రయత్నం మొదలు పెట్టాలని ఈ మొక్కల గురించి తెలిసిన ప్రముఖులు, ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
భవిష్యత్తులో చాలా ప్రమాదం ఉంటుంది :
కోనోకార్పస్ మొక్కలు భవిష్యత్తులో తీవ్ర ప్రమాదాలను కలిగించే అవకాశం ఉంది, అందువల్ల తక్షణ చర్యలు తీసుకోవడం అవసరం. ప్రభుత్వాలు, ప్రజలు, నిపుణులు కలిసి పనిచేయాలి, ఈ దుష్ప్రభావాలను నివారించడానికి మరియు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలి. కోనోకార్పస్ మొక్కల గురించి అవగాహన కలిగి, వాటి దుష్ప్రభావాలను అర్థం చేసుకోవడం ద్వారా సమాజం ఆరోగ్యంగా, సురక్షితంగా ఉండేందుకు దోహదపడుతుందాని తెలియచేస్తున్నము.
మీ దృశ్యం న్యూస్.








