|| దృశ్యం న్యూస్ ||
ఈ రోజు ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలను మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. బుధవారం పరీక్షా కేంద్రాలైన బాలుర జూనియర్ కళాశాల మరియు TGRS లో నిర్వహించిన సమీక్షలో పరీక్షల నిర్వహణపై కలెక్టర్ నిశితంగా దృష్టి సారించారు. విద్యార్థుల హాజరుపై విచారణ చేసి, సీసీ కెమెరాల పనితీరు, స్క్రైబ్ విధానం, మరియు ఇతర ముఖ్యమైన వివరాల గురించి సంబంధిత అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, “మెదక్ జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నాయని, మొదటి రోజు 6410 మంది విద్యార్థులు పరీక్ష రాయాల్సి ఉండగా, 6180 మంది హాజరయ్యారాని, 230 మంది వివిధ కారణాల వల్ల పరీక్షకు హాజరుకాలేదు” అని పేర్కొన్నారు.
అదేవిధంగా, తాగునీటి వసతి, మూత్రశాలలు, వైద్య సిబ్బంది మరియు ఔషధాలు అందుబాటులో ఉండాలని కలెక్టర్ సూచించారు. ఆయా సదుపాయాలను పరీక్షా కేంద్రాలలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కోరారు.
పరీక్షలు పక్కాగా నిర్వహించేందుకు, మాల్ ప్రాక్టీసుకు అవకాశమివ్వకుండా, ప్రతి విద్యార్థిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, ఎలక్ట్రానిక్ గడియారాలు, మొబైల్ ఫోన్ల వంటి ఉపకరణాలను అనుమతించవద్దని ఆదేశించారు.
ఈ తనిఖీలో జిల్లా ఇంటర్మీడియట్ అధికారి మాధవి మరియు ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.








