|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల రెవెన్యూ అధికారి (ఎమ్మార్వో) వ్యవహరించిన తీరు ప్రస్తుతం మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు సంబంధించిన అంశంపై సమాచారం తెలుసుకోవడానికి ఒక జర్నలిస్ట్ ఫోన్ ద్వారా సంప్రదించగా, “అక్రిడేషన్ కార్డు ఉన్న జర్నలిస్టులే నన్ను సంప్రదించాలి అని, అలాంటి వారికి మాత్రమే నా కార్యాలయంలోకి అనుమతి ఉంటుంది” అని సమాధానం ఇవ్వడంతో ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా పాత్రపై అనవసర పరిమితులు విధించేలా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భారత రాజ్యాంగంలోని Article 19(1)(a) ప్రతి భారత పౌరుడికి మాట్లాడే స్వేచ్ఛ, అభిప్రాయాన్ని వ్యక్తపరచే హక్కు, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కును కల్పిస్తుంది. ప్రజలకు సంబంధించిన అంశాలపై సమాచారం కోరడం కూడా ఈ హక్కుల పరిధిలోకి వస్తుంది. మీడియా ప్రతినిధులు ప్రజల తరపున ప్రశ్నలు అడిగి, ప్రజా సమస్యలను, అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం వారి సామాజిక బాధ్యతగా పరిగణించబడుతుంది.
కోటగిరి మండలంలోని ఒక గ్రామంలో జరుగుతున్న మొరం తవ్వకాలపై, రవాణాపై వివరాలు తెలుసుకునేందుకు జర్నలిస్ట్ ఫోన్ ద్వారా సంప్రదించినప్పుడు, అక్రిడేషన్ కార్డు ఉన్నవారికి మాత్రమే స్పందిస్తామని, నా కార్యాలయంలోకి అనుమతిస్తామని మీడియా ప్రతినిధితో అసంతృప్తిగా సమాధానం ఇవ్వడం తన హక్కుకు భంగం కలిగించే అంశం. అక్రిడేషన్ అనేది ప్రభుత్వ గుర్తింపు మాత్రమే కానీ జర్నలిజం చేయడానికి తప్పనిసరి అర్హత కాదని, ప్రస్తుతం డిజిటల్ యుగంలో పత్రికలు, వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా వార్తలను ప్రజలకు చేరవేయడం జరుగుతోంది అని మీడియా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులకు తెలియజేస్తూన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అక్రిడేషన్ కార్డులు కొందరికి మాత్రమే మంజూరు అవుతాయి. అయితే అక్రిడేషన్ లేకపోయినంత మాత్రాన ఒక వ్యక్తి జర్నలిస్టు కాదని భావించడం సరైన విధానం కాదని మీడియా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
ఓ జర్నలిస్టుతోనే ఇలాంటి స్పందన ఉంటే సామాన్య ప్రజలతో అధికారి వ్యవహారం ఎలా ఉంటుందో అనే ప్రశ్నలు కూడా లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వ అధికారులు ప్రజలతో మీడియాతో సమన్వయంతో వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి బలం చేకూర్చుతుంది, భారత రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను గౌరవిస్తూ అధికారులు స్పందించడం అవసరమని జర్నలిస్టులు అభిప్రాయపడుతున్నారు.








