|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా వర్ని మండలంలోని గ్రామపంచాయతీ సత్యనారాయణ పరిధిలో గల కోటయ్య క్యాంప్ గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. కిరణ్, రవీందర్ అనే 9వ తరగతి విద్యార్థులు పండగ సెలవుల అనంతరం బుధవారం పాఠశాలకు వచ్చి కొద్దిసేపటిలో కనబడకపోయారు.
విద్యార్థులు కనిపించకపోవడంతో పాఠశాల సిబ్బంది, తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు గురై గాలింపు చర్యలు ప్రారంభించారు. పాఠశాల వార్డెన్ ఈ విషయమై వర్ని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టారు.
తద్వారా అదే గ్రామంలోని ఓ ఆలయంలో విద్యార్థులు తలదాచుకున్నట్లు గుర్తించి, సురక్షితంగా పాఠశాలకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో సహకరించిన పోలీసులకు, గ్రామస్థులకు, పాఠశాల సిబ్బందికి పాఠశాల వార్డెన్ కల్పన కృతజ్ఞతలు తెలిపారు.








