|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా రూరల్ పరిధిలో రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం అధికారికంగా ప్రారంభమైంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి అధికారులు అన్ని చర్యలను పూర్తి చేసి, అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రారంభించారు. అయితే ఈ విడతలో రిటర్నింగ్ అధికారుల గదుల్లోకి మీడియా ప్రవేశం నిరాకరించడం పెద్ద చర్చగా మారింది.
ప్రథమ విడతలో రిటర్నింగ్ అధికారుల గదుల్లోకి మీడియాకు ప్రవేశం కల్పించినప్పటికీ, రెండో విడతలో మాత్రం విలేకరులకు అనుమతులు నిరాకరించడంతో మీడియా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత అధికారులను మీడియా ప్రశ్నించగా, గత విడతలో మీడియా రద్దీ కారణంగా పలు సమస్యలు తలెత్తినందున ఈసారి ప్రవేశాన్ని పరిమితం చేశామని స్పష్టం చేశారు.
ఒక మండలంలో అనుమతించి, మరో మండలంలో నిరాకరించడం వల్ల మీడియా ప్రతినిధులు వారి యాజమాన్య సంస్థలకు సరైన సమయానికి సమాచారం అందించలేక ఒత్తిడికి గురవుతూ జిల్లా వ్యాప్తంగా మీడియా ప్రతినిధులు గందరగోళానికి గురవుతున్నారు.
విలేకరులు జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్‌ను ఉద్దేశిస్తూ స్పష్టమైన మార్గదర్శకాలు వెంటనే జారీ చేయాలని కోరుతున్నారు. తమ విధులను గౌరవంగా నిర్వహించేందుకు అధికారికంగా—
ప్రొఫెషనల్ జర్నలిస్టులకు మీడియా ఐడెంటిటీ–ఎంట్రీ పాసులు
లేదా నామినేషన్ దాఖలు చేసే ప్రతి అభ్యర్థి యొక్క ఫోటోలు, వీడియోలు, మరియు సరైన సమాచార వివరాలు ప్రతి సమయం మీడియాకు చేరే విధంగా ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చెయ్యడం అవసరమని మీడియా వర్గాలు అభిప్రాయపడ్డాయి.
మీడియా ఆక్సెస్ కల్పించడం ప్రజాస్వామ్య ప్రక్రియలో పారదర్శకతను పెంచుతుందని అని, నామినేషన్ ప్రక్రియ సరైన విధంగా ప్రజల్లోకి వెళ్లాలంటే స్పష్టమైన నియమాలు రూపొందించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
జిల్లా ఎన్నికల అధికారి/కలెక్టర్ ఈ వివాదంపై తక్షణ నిర్ణయం తీసుకోవాలని మీడియా ప్రతినిధులు కోరుతున్నారు.








