|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అసెంబ్లీలో ప్రసంగిస్తూ, ఇందూర్ పట్టణంలో వెయ్యి ఏళ్ల చరిత్ర కలిగిన శ్రీ రఘునాథ ఆలయం శిథిలావస్థలో ఉందని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు.

వేములవాడ, యాదాద్రి వంటి ప్రఖ్యాత ఆలయాల తరహాలోనే రఘునాథ ఆలయం ఉత్తర తెలంగాణ భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా నిలుస్తుందని తెలిపారు. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాసు మహారాజ్ నిర్మించిన ఈ ఆలయం గతంలో భక్తుల రద్దీతో కళకళలాడిందని ప్రస్తుతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దుస్థితికి చేరిందన్నారు.
1862లో నిజాం పాలకులు కోటను కేంద్ర కర్మాగారంగా మార్చి ఆలయంలో పూజలను నిషేధించారని, ఇది దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. తెలంగాణ విమోచన పోరాట యోధులు దాశరథి కృష్ణమాచార్యులు, వట్టికోట ఆల్వరు స్వామి ఇక్కడ బంధీలుగా గడిపారని, ఈ ప్రదేశాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
శ్రీ రామ నవమి రోజున 70,000 మందికిపైగా భక్తులు విచ్చేస్తారని, ఆలయ పునర్నిర్మాణం, మౌలిక సదుపాయాల కోసం 20 కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని సీఎం ను డిమాండ్ చేశారు.








