|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా, ఎడపల్లి మండలంలో సర్పంచ్ల ఫోరం అధ్యక్ష పదవిపై కొనసాగిన ఉత్కంఠకు శనివారం తెరపడింది. మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా నాగుల రాజు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పులి శ్రీనివాస్ ప్రకటించారు. ఈ ఎన్నికతో మండల రాజకీయాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

ఈ సందర్భంగా నాగుల రాజు గౌడ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతను అప్పగించిన మండల నాయకత్వానికి, వివిధ గ్రామాల సర్పంచులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన ఈ కీలక పదవిని పూర్తి బాధ్యతతో నిర్వర్తిస్తూ, సర్పంచ్ల మధ్య ఐక్యతను బలోపేతం చేస్తానని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్ పార్టీని మండల స్థాయిలో మరింత బలంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానన్నారు.
మండలంలోని అన్ని గ్రామాల సర్పంచుల సూచనలు, సలహాలను గౌరవిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ల ఫోరం నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులుగా పరిగే సాయిలు, దొడ్డి శ్రీనివాస్, నీరడి జ్యోతి రవికుమార్ నియమితులయ్యారు. జనరల్ సెక్రటరీలుగా వినోద్, కొమ్మేటి సత్యం, మంగ్య నాయక్ ఎంపికయ్యారు. కోశాధికారిగా చేపూరి వీణా శ్రీనివాస్ గౌడ్, ప్రచార కార్యదర్శిగా నగునూరి అనురాధ రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ముఖ్య సలహాదారుగా సుంచన కోట అనురాధ రాధాకిషన్ గౌడ్, కార్యవర్గ సభ్యులుగా నోముల జయశ్రీ శ్రీనివాస్ గౌడ్, గోపరి స్రవంతి సుమన్, సుండు కిషన్ నియమితులయ్యారు.








