|| దృశ్యం న్యూస్ ||
మెదక్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులను వేగవంతం చేసి, ప్రణాళికాబద్ధంగా పూర్తిచేయాలని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎమ్యెల్యే మాట్లాడుతూ, ఏడుపాయల వనదుర్గామాత ఆలయం అభివృద్ధి పనులను త్వరగా ముగించాలని సూచించారు.
అభివృద్ధి ప్రాజెక్టులపై సమీక్ష :

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, పంచాయతీరాజ్, మిషన్ భగీరథ, మున్సిపాలిటీ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి అభివృద్ధి ప్రాజెక్టుల పురోగతిపై సమీక్ష చేపట్టారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యాటక ప్రాధాన్యమున్న ఏడుపాయల ఆలయ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్నారని పనుల్లో ఆలస్యం లేకుండా చూడాలని అన్నారు.
ఇన్ఫ్రాస్ట్రక్చర్, నీటి సరఫరా పై దృష్టి :
పెండింగ్‌లో ఉన్న రోడ్లు, భవనాల పనులను వేగంగా పూర్తిచేయాలని, అలాగే చెరువుల అభివృద్ధికి అవసరమైన ప్రతిపాదనలు అందించాలని సూచించారు. వేసవి నేపథ్యంలో తాగునీటి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరా నిరంతరాయంగా కొనసాగాలని అధికారులకు ఆదేశించారు.
విద్యుత్, ఆరోగ్య, మున్సిపల్ అభివృద్ధి :

విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా, అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు అవసరమైతే వెంటనే ఏర్పాటు చేయాలని, రామాయంపేట, మెదక్ మున్సిపాలిటీలలో వైకుంఠదామాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అలాగే, ఫాగింగ్ కార్యక్రమాలను నిర్వహించి దోమల నివారణ చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
విద్యా, ఆరోగ్య శాఖల్లో మెరుగుదల :
పాఠశాలల అభివృద్ధికి రూ.2 కోట్లు కేటాయించామని, విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి తెచ్చేందుకు మరింత నిధులు మంజూరు చేస్తామని, మెదక్ మెడికల్ కళాశాలలో వసతులు మెరుగుపరచేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే రోహిత్ రావు తెలిపారు.
మెదక్ అభివృద్ధిలో అందరి భాగస్వామ్యం కీలకం అని, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తే మెదక్ రాష్ట్రంలో అగ్రగామిగా నిలుస్తుందని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు పేర్కొన్నారు.








