|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ డి.వి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఎన్నికల నియమావళి అవగాహన మరియు శిక్షణా కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో తూప్రాన్ ఆర్డీఓ జయచంద్ర రెడ్డి ఎన్నికల సమయంలో పాటించవలసిన నియమాలు, జాగ్రత్తలు మరియు ఉల్లంఘనలకు తీసుకోవలసిన చర్యలను వివరించారు.

జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు పారదర్శకంగా, శాంతి భద్రతలతో సజావుగా జరగాలని ప్రతి పోలీస్ అధికారి కృషి చేయాలని సూచించారు. ప్రతి అధికారి తమ పరిధిలోని గ్రామాలను సందర్శించి పరిస్థితులను అవగాహన చేసుకుని, సెన్సిటివ్ గ్రామాలను ముందుగానే గుర్తించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
అదేవిధంగా, వాహన తనిఖీలు కఠినంగా నిర్వహించి అక్రమ రవాణా మరియు అసాంఘిక చర్యలను అరికట్టాలని ఎస్పీ ఆదేశించారు. సిబ్బందికి ఎన్నికల నియమావళిపై పూర్తి స్థాయి శిక్షణ ఇవ్వాలని కూడా సూచించారు. ఎన్నికల సమయంలో చట్టం, శాంతి భద్రతలను కాపాడేందుకు అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్.మహేందర్, డీఎస్పీలు ప్రసన్న కుమార్, నరేందర్ గౌడ్, రంగా నాయక్, సీఐలు సందీప్ రెడ్డి, మధుసుధన్ గౌడ్, జాన్ రెడ్డి, రంగా కృష్ణ, వెంకట రాజా గౌడ్, జార్జ్ శైలేందర్, ఎస్ఐలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.








