|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ యువతతో పాటు విద్యార్థులు మత్తు పదార్థాలు, డ్రగ్స్ వంటి వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉండాలని సూచించారు. స్థానిక కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో శుక్రవారం జరిగిన డ్రగ్స్ నిర్మూలన సమావేశంలో కలెక్టర్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి అధికారులు, పోలీసు సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.

కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం డ్రగ్స్ వినియోగం మహమ్మారి మరింతగా పెరిగిపోతుందనీ, ఇది సమాజాన్ని ముఖ్యంగా యువతను చెడు దారిలోకి నెట్టేస్తోందని, మత్తు పదార్థాలు అలవాటు చేసుకోవడం వల్ల దీర్ఘకాలిక రుగ్మతలు, మానసిక, శారీరక సమస్యలు తీవ్రంగా పెరుగుతాయని తెలిపారు. యువత వ్యసనాలకు బానిసగా మారితే కుటుంబాలు, సమాజం, దేశ భవిష్యత్తు ప్రభావితం అవుతుందని హెచ్చరించారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీయడంతో పాటు నేర ప్రవర్తనకు దారితీస్తాయని చెప్పారు. తల్లిదండ్రులు పిల్లలపై శ్రద్ధ పెట్టాలని సూచించారు. మంచి అలవాట్లు అలవర్చుకుని చెడు వ్యసనాలకు పూర్తిగా దూరంగా ఉంటేనే వ్యక్తిగత, వృత్తి అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా డ్రగ్స్ నిర్మూలన అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








