|| దృశ్యం న్యూస్ ||
ఈ హోలీ పండుగ ప్రజల జీవితాల్లో ఆనందం, సంతోషం నింపాలని మెదక్ ఆర్డీవో రమాదేవి తెలిపారు. శుక్రవారం హోలీ వేడుకలు మెదక్ ఆర్డీవో క్యాంప్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆర్డీవో కార్యాలయ సిబ్బందితో కలిసి రమాదేవి పాల్గొని రంగుల పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ, హోలీ పండుగ రాగద్వేషాలకు అతీతంగా అందరినీ ఒకటిగా చేసే ప్రత్యేకమైన పండుగ అని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకలు ప్రజల జీవితాల్లో సంతోషాన్ని, ఉల్లాసాన్ని కలిగించాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా హోలీని పండుగను నిర్వహించుకుంటారని తెలిపారు.
హోలీ వేడుకల సందర్భంగా ఆర్డీవో రమాదేవి క్యాంపు కార్యాలయ సిబ్బందికి మర్యాదపూర్వకంగా రంగు బొట్టు పెట్టి వారితో ఆనందంగా గడిపారు. అనంతరం కార్యాలయ సిబ్బంది, అధికారులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుని రంగులతో ఆటపాటలతో ‘అలాయ్ బలాయ్’ నిర్వహించడంతో హొలీ పండగ వేడుకలో ఉత్సాహం రెట్టింపయ్యింది.
హోలీ పండుగ ప్రజల జీవనశైలిలో స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని పెంపొందించేందుకు కారణమవుతుందని రమాదేవి తెలిపారు. జిల్లా ప్రజలు ఆనందంగా, ఉల్లాసంగా హోలీ వేడుకలను జరుపుకోవాలని ఆర్డీఓ కోరారు.








