శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ( మల్కాపూర్ ) ఆలయ విశిష్టత.

|| దృశ్యం న్యూస్ ||

పవిత్రమైన శ్రీ అనంత పద్మనాభ స్వామి ( శ్రీ లక్ష్మీ నరసింహస్వామి) ఆలయ సందర్శన :

 

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండలం మల్కాపూర్ గ్రామంలోని అటవీ ప్రాంతంలోని ఓ గుహలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపంగా దర్శనమిస్తూ అనంత పద్మనాభ స్వామిగా పూజలందుకునే ప్రత్యేక ఆచరణ ఉన్న ఆలయం ఇది.

భక్తులకు మాత్రమే కాకుండా, ప్రకృతి ప్రేమికులకు కూడా ఓ మనోహరమైన అనుభూతిని అందిస్తుంది ఈ ప్రదేశం.
ఈ ఆలయ పరిసర ప్రాంతం హరిత వాతావరణం, చుట్టూ గుట్టలు మరియు చెరువులతో అలంకరించబడి ప్రకృతి సౌందర్యంతో ఈ పవిత్ర క్షేత్రం భక్తులకు దైవ దర్శనంతో పాటు వారి మనస్సుకు ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తుంది.

ఆలయ చరిత్ర:

ఈ ఆలయ చరిత్ర విశేషమైనది. దాదాపు 400 సంవత్సరాల క్రితం గాంధార ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడటంతో అక్కడి ప్రజలు, పాలకులు జీవనోపాధి కోసం ఆ ప్రాంతాన్ని వదిలి ఇతర ప్రదేశాలకు ప్రయాణం మొదలు పెట్టారు, ఈ ప్రయాణంలో భాగంగా గాంధార వంశ పురోహితులు ఈ ఆలయ సమీప ప్రాంతంలో విశ్రాంతి కొరకై నిద్రించగా శ్రీ అనంత పద్మనాభ స్వామి పునమాచార్యులు అనే పూరోహితులకు స్వప్నంలో దర్శనమిచ్చి తను ఈ ప్రాంతంలో వెలసి ఉన్నట్లు తెలియచేస్తూ పవిత్రమైన రూపంతో దర్శనం ఇవ్వడం జరిగిందని,

పురోహితుడికి స్వప్నంలో దర్శనమిచ్చిన స్వామి “తనను స్మరించుకుంటు తను తెలిపిన మార్గంలో పయనించి, తను కొలువై ఉన్న ప్రదేశానికి చేరుకుంటే నేను మీకు దర్శనం ఇస్తాను అని చెప్పడంతో, స్వప్నంలో స్వామి చెప్పిన ప్రకారం అ ప్రాంతానికి చేరువై పునమాచార్యులు, మరియు తనతో ఉన్న పూరోహితులు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామిని స్మరించుకోవడంతో అప్పుడు వారికి ఒక గుహలోని బండరాయిపై ఓ పెద్ద నాణెము పరిమాణంలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ముఖం ఇరువైపులా శంకు చక్రాలతో దర్శనం ఇవ్వడం జరిగిందని, ఈ దివ్యమైన సంఘటనతో ఆ ప్రాంతం యొక్క పవిత్రత ఆలయం యొక్క చరిత్ర ప్రారంభమైనది.

శ్రీ లక్ష్మీ నరసింహస్వామి రూపం – శ్రీ అనంత పద్మనాభ స్వామిగా పూజలు :

పునమాచార్యులకు స్వప్నంలో తను శ్రీ లక్ష్మి నరసింహస్వామి రూపంలో ఉన్న కూడా, శ్రీ అనంత పద్మనాభ స్వామి అనే నామంతో పిలుస్తూ, ప్రతి కార్యము, అభిషేకాలు, పూజ విధానాలు శ్రీ అనంత పద్మనాభ స్వామిగా నిర్వహించాలనే విషయం కూడా తెలిపారని, ఆ రోజు నుండి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి, పద్మనాభ స్వామిగా పూజలందుకుంటు ప్రత్యేకతను ప్రఖ్యాతిని గాంచింది ఈ ఆలయం.

అదేవిధముగా బండరాయి పై ఓ నాణెం రూపంలో దర్శనం ఇచ్చినా శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ప్రతిమ, కాలక్రమేణా పెద్దగా రూపాంతరం చెందుతూ వస్తోంది. ఈ మార్పు వల్ల భక్తులకు స్వామి ఈ ప్రదేశంలో ఉన్నారని విశ్వాసం దృఢంగా ఏర్పడి, ఈ ఆలయం రోజురోజుకీ ప్రాముఖ్యతను పెంచుకుంటూ వస్తోంది. దీనివల్ల భక్తుల పూజలు, సందర్శన మరియు ఆధ్యాత్మిక సేవలు అభివృద్ధి చేస్తూనే ఉన్నారు ఆలయ పూజారులు, ఆలయ కమిటీ నిర్వాహకులు.

ఆలయ ఉత్సవాలు : ప్రత్యేక పర్వదినాలు :

ఈ ఆలయ ప్రధాన పూజలు మరియు ఉత్సవాలు భక్తులకు మరింత ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తాయి. ముఖ్యమైన పర్వదినాల్లో ఆలయ చరిత్ర ప్రకారం ఉన్న ప్రత్యేక పూజలు నిర్వహించబడతాయి.

1. భాద్రపద శుద్ధ చతుర్దశి (అనంత చతుర్దశి) :

ఈ రోజు భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంత కోటి వత్తులతో దీపారాధన జరుగుతుంది.

2. మాఘ బహుళ తదియ నుంచి మాఘ బహుళ నవమి వరకు :

ఈ పర్వదినాల్లో ఆలయంలో ఉత్సవాలు ( జాతర ) నిర్వహిస్తారు, ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి కళ్యాణం, రధోత్సవం, చక్రతీర్ధం, యజ్ఞాలు నిర్వహించబడతాయి.

3. ప్రతి శనివారం ప్రత్యేక పూజలు :

ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు అన్నదానం మరియు సేవలు అందించడం జరుగుతుంది.
అదేవిధంగా దంపతులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తూ ఉంటారు.

ఆలయ ప్రత్యేకతలతో భక్తులకు మంచి అనుభూతి :

ఈ ఆలయం ఒక ప్రాచీనమైన, పవిత్రమైన చరిత్రలతో నిండి ఉన్న క్షేత్రంగా భక్తుల ప్రేమను పొందింది. ఆధ్యాత్మిక సేవలు, ప్రత్యేక పూజలు మరియు ఉత్సవాలు ఆలయాన్ని ప్రతిపాదిస్తూ, ప్రతి భక్తునికి శాంతినీ, ఆశనీ, అద్భుతమైన అనుభూతినీ అందిస్తాయి.

ఆలయ అభివృద్ధిలో భాగంగా కాలక్రమేణా, గణపతి, పద్మనాభ స్వామి, నవగ్రహ, శనీశ్వర, ఆంజనేయ, విగ్రహాలను ఆలయ పరిసరాలలో ప్రతిష్టించారు, అదేవిధముగా స్వామి వారి అభిషేకం, చక్రతీర్థ కార్యం కోసం కోనేరును నిర్మించారు.

మీరు ఈ పవిత్ర క్షేత్రాన్ని సందర్శించినప్పుడు, మీరు దేవుని దివ్యమైన దర్శనంతో పాటు ప్రకృతి సౌందర్యం కూడా అనుభవిస్తారు.

Join WhatsApp

Join Now

Leave a Comment