|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా 8వ డివిజన్ పరిధిలోని లలితనగర్లో గత కొన్ని నెలల తరబడి కొనసాగుతున్న లోవోల్టేజి సమస్య స్థానికులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఉదయం నుండి సాయంత్రం వరకు సరైన వోల్టేజి అందక గృహాల్లోని ఫ్రిజ్లు, ఫ్యాన్లు, టీవీలు, వాటర్ మోటార్లు సక్రమంగా పనిచెయ్యకపోవడం, పరికరాలు తరచుగా దెబ్బతిని ప్రజలకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. ఇది విద్యుత్ శాఖ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనంగా నిలుస్తోంది అని స్థానికులు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ప్రత్యేకంగా ఉదయం వేళల్లో బోర్ మోటార్లు పని చేయకపోవడంతో నిత్యావసర నీటి కొరత వల్ల రోజురోజుకు తీవ్ర సమస్య ఏర్పడి ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు సమయానికి తమ పనులకు హాజరుకాలేక ఇబ్బందులు పడుతున్నారు.
ఇది ఇలా ఉండగా వేసవి ప్రారంభ దశలోనే తరచూ విద్యుత్ నిలిపివేతలు జరుగుతుండటం పట్ల ఆవేదనకు గురవుతూ, గత ఏడాది కూడా రాత్రింబవళ్లు విద్యుత్ అంతరాయాల వల్ల తీవ్ర అసౌకర్యం ఎదుర్కొని ఎన్నో నిద్రలు లేని రాత్రులు గడిచాయని, అప్పుడే ఈ సమస్యపై స్థానిక సంబంధిత విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన అదేవిధంగా జిల్లా కలెక్టర్కు ఫిర్యాదులు చేసినప్పటికీ స్పందన కనిపించలేదని ఆరోపిస్తున్నారు.ఇకనైన ఈ నిర్లక్ష్య వైఖరిని వెంటనే విరమించి తక్షణమే జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని లోవోల్టేజి సమస్యకు, విద్యుత్ అంతరాయ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని లలితనగర్ వాసులు కఠినంగా డిమాండ్ చేస్తున్నారు.








