|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా కోటగిరి పోతంగల్ ఉమ్మడి మండలంలో ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయనకు ప్రెస్ క్లబ్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా పోచారం భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ, జర్నలిస్టులు ప్రజలకు మరియు ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తారని, ప్రతిరోజూ జర్నలిస్టులు ప్రజా సమస్యలపై సృజనాత్మక కథనాలను రాస్తూ, మరుగునపడ్డ నిజాలను వెలికితీయడం ఒక గొప్ప కర్తవ్యమని చెప్పారు. ప్రజల స్వరాన్ని ప్రభుత్వానికి చేరవేయడంలో, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
అలాగే, ప్రతి జర్నలిస్టు తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తే సమాజంలో మంచి గుర్తింపు వస్తుందని చెప్పారు. జర్నలిస్టుల సమస్యలపై ఎల్లప్పుడూ పోరాటం చేస్తూనే ఉంటామని భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి మండలానికి చెందిన ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, అధికారులు మరియు మీడియా మిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.








