|| దృశ్యం న్యూస్ ||
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జానకంపేట్ గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశం గ్రామ సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ అధ్యక్షతన గ్రామ పంచాయతీ కార్యాలయంలో సాధన సమావేశం నిర్వహించడం జరిగింది.
గ్రామ సర్వాంగాభివృద్ధే లక్ష్యంగా ఈ సమావేశంలో పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించి, కీలక తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.
ఈ సమావేశంలో తొలి తీర్మానంగా బోధన్–నిజామాబాద్ ప్రధాన రహదారి పక్కనే ఉన్న అశోక్ సాగర్ చెరువు కట్టపై మినీ ట్యాంక్ బండ్ (Mini Tank Bund) ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మినీ ట్యాంక్ బండ్ నిర్మాణం వల్ల చెరువు పరిసర ప్రాంతాల అందచందాలు మరింత మెరుగుపడటంతో పాటు, గ్రామానికి పర్యాటక ఆకర్షణ పెరుగుతుందని సభ్యులు అభిప్రాయపడ్డారు. అదేవిధంగా గ్రామ ప్రజలకు విశ్రాంతి, వినోదానికి అనువైన స్థలం ఏర్పడడంతో సామాజిక వాతావరణం మెరుగవుతుందని పేర్కొన్నారు.
అదేవిధంగా జానకంపేట్ గ్రామ పంచాయతీకి శాశ్వత భవనం నిర్మాణానికి మరో ముఖ్యమైన తీర్మానం చేశారు. పంచాయతీ భవనం ఏర్పాటు వల్ల పరిపాలనా వ్యవహారాలు మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు ప్రజలకు సేవలు వేగవంతంగా అందుతాయని సభ్యులు వెల్లడించారు. అలాగే గ్రామంలో శానిటేషన్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, తాగునీటి సరఫరా నిరంతరంగా కొనసాగేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సమావేశంలో స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు.
ఈ సమావేశంలో ఉపసర్పంచ్ నీలం కృష్ణ, పంచాయతీ కార్యదర్శి సందీప్, గ్రామ వార్డు సభ్యులు పాల్గొని తమ విలువైన సూచనలు అందించారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాలను సమిష్టిగా ముందుకు తీసుకెళ్లాలని సర్పంచ్ సుంచనకోట అనురాధ రాధకిషన్ గౌడ్ సమావేశంలో పిలుపునిచ్చారు.








