|| దృశ్యం న్యూస్ ||
తెలంగాణ సాంస్కృతిక ప్రతీకగా నిలిచిన పూల పండుగ బతుకమ్మ మహిళలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు బాన్సువాడలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బతుకమ్మ సంబరాలు మరింత వైభవంగా సాగాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వివిధ రకాల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలలు అందరూ కలిసి పాటలు పాడుతూ, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ వేడుకలో రంగులు నింపారు.

వేలాది మహిళలు, చిన్నారులు, పార్టీ మహిళా నాయకులు ఈ సంబరాల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పద్మాదేవేందర్ రెడ్డి మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని, పార్వతీదేవి ప్రతిరూపమైన గౌరమ్మను ప్రతిష్టించి కొలిచే అద్భుత పండుగ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే పువ్వులను పూజించే సంస్కృతి తెలంగాణకే ప్రత్యేకమని తెలిపారు.
తెలంగాణ ఉద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన బతుకమ్మను మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించారని గుర్తు చేశారు. తొమ్మిది రోజుల పాటు వివిధ రకాల పూలతో అద్భుతంగా నిర్వహించే బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయ ఔన్నత్యానికి నిలువెత్తు నిదర్శనమని వివరించారు.








