|| దృశ్యం న్యూస్ ||
అనాధ బాలలకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తును ప్రగల్బంగా మార్పు చేయాలనే లక్ష్యంతో, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో “భవిష్యజ్యోతి ట్రస్ట్” ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పేర్కొన్నారు.
తల్లిదండ్రులు లేని చిన్నారుల అభ్యున్నతికి ఈ ట్రస్ట్ చొరవ చూపించబోతుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ, జిల్లా సెషన్స్ జడ్జి సునీత కుంచాల, పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్, డిచ్పల్లి పోలీస్ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ఈ ట్రస్ట్ కు విరాళాలు అందించడానికి అన్ని వర్గాలకు చెందిన దాతలు ముందుకు రావాలని కోరుతున్నాను” అని చెప్పారు.
భవిష్యజ్యోతి ట్రస్ట్ అనాథ బాలల విద్యను ప్రోత్సహించే మహా సంకల్పంతో ప్రారంభించబడింది. దీని ద్వారా ప్రాథమిక దశ నుండి నాణ్యమైన విద్యను అందించటమే కాక, బాలల అభివృద్ధికి కావాల్సిన అన్ని వసతులు కూడా అందించబడతాయి. ఈ కార్యక్రమానికి జిల్లా యంత్రాంగం పూర్తి సహాయాన్ని అందచేస్తుంది అని తెలిపారు.

సునీత కుంచాల మాట్లాడుతూ, సాధారణంగా న్యాయ సేవాధికార సంస్థలు లోక్ అదాలత్‌ల నిర్వహణ, న్యాయ పరమైన అవగాహన సదస్సులపై మాత్రమే కేంద్రీకృతమవుతుంటాయి కానీ నిజామాబాద్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సామాజిక సేవా కార్యక్రమాలను విస్తృత స్థాయిలో కొనసాగిస్తోంది. ఉదాహరణకు, 11,000 మంది బాలికలకు కరాటే శిక్షణ అందించడం, గ్రామాభివృద్ధి కమిటీల పనితీరును మెరుగు పరచడం వంటి పలు కార్యక్రమాలను చేపడుతుందని తెలిపారు.
ఈ ట్రస్ట్ ద్వారా అనాథ బాలలకు కడుపు నింపుతు విద్య అందించటమే కాక, వారికొరకు అవసరమైన మరింత సదుపాయాలను కూడా అందించనున్నది, కాకతీయ స్కూల్, రవి పబ్లిక్ స్కూల్, నిర్మల హృదయ్ పాఠశాలల యాజమాన్యాలు ఇప్పటికే అనాథ బాలలకు ఉచిత ప్రవేశాలు అందించేందుకు ముందుకు వచ్చాయని కలెక్టర్ చెప్పారు.

పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ మాట్లాడుతూ, “అనాథ బాలలను దత్తత తీసుకునే అవకాశం కలగడం నా అదృష్టం” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు, అనాథ బాలల భవిష్యత్తుకు అండగా నిలబడేందుకు తమ కృషిని కొనసాగించాలని ఆకాంక్షించారు.
అనేక రకాల విరాళాలను స్వీకరించేందుకు ట్రస్ట్ ప్రత్యేకంగా ఐసీఐసీఐ బ్యాంక్, నాందేవ్ వాడ బ్రాంచ్ లో అకౌంట్‌ను ప్రారంభించింది. దాతలు తమ విరాళాలను భవిష్యజ్యోతి, అకౌంట్ నెంబర్: 354705001646,
ఐ.ఎఫ్.ఎస్.కోడ్: ఐసీఐసీ003547
నందు జమ చేయవచ్చు అని తెలిపారు.
భవిష్యజ్యోతి ట్రస్ట్ అనాథ బాలలకు మెరుగైన విద్యను అందించటానికి, వారి భవిష్యత్తును వెలుగు చూడటానికి ఉద్దేశించిన పథకం. అన్ని వర్గాల దాతలు అందుకు మద్దతు ఇవ్వాలని, విద్యార్థుల అభ్యుదయానికి తమ వంతు తోడ్పాటును అందించాలని ఈ కార్యక్రమం ద్వారా ప్రముఖులు పిలుపు ఇవ్వడం జరిగింది.










