|| దృశ్యం న్యూస్ ||
మెదక్ జిల్లా, మాసాయిపేట మండలంలో బుధవారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పర్యటించారు. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత విద్యాబోధన విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి ఈ విధానం ఎలా సహాయపడుతోందో తెలుసుకున్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, ప్రస్తుతం జిల్లాలోని 06 ప్రాథమిక పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, తెలుగు, ఇంగ్లీష్ చదవడం, గణితంలో జమ, తీసివేత, గుణించటం, భాగించటం తదితర అంశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో విద్యార్థులకు బోధిస్తున్నామని వివరించారు.
ఈ కార్యక్రమం విద్యార్థులకు సత్ఫలితాలు ఇస్తుందని వచ్చే ఏడాది మరిన్ని పాఠశాలల్లో దీన్ని విస్తరించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

అనంతరం కలెక్టర్ అంగన్వాడి కేంద్రాన్ని సందర్శించారు, చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సూచించారు. తరగతి గదులు పిల్లలకు ఆకర్షణీయంగా ఉండాలని, ఎక్కువ బొమ్మలు, ఆట వస్తువులు అందుబాటులో ఉండాలని తెలిపారు. మెనూ ప్రకారం ఆరోగ్యకరమైన భోజనం అందించాలన్నారు. స్వచ్ఛమైన తాగునీరు, శుభ్రమైన మరుగుదొడ్లు అందుబాటులో ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు.

అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తూ, తల్లిదండ్రులతో నెలవారీ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. చిన్నారుల బరువు, ఎత్తు వివరాలు సరిగ్గా నమోదు చేయాలని చెప్పారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, పాఠశాల సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.








